శంషాబాద్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డాక్టర్ ప్రియాంకను అతి దారుణంగా హత్య చేసిన తీరు అందర్ని కదిలించి వేసింది. ఆ క్రూరత్వాన్ని తెలుసుకొని జనం ఆగ్రహం ఆకాశానికి చేరింది. నిందితులను ఎలాగైన ఎన్ కౌంటర్ చేయాలని పట్టుబడుతున్నారు. మంత్రులను కూడా నిలదీస్తున్నారు.
ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులను పరామర్శించడానికి వెళ్లిన మంత్రి సత్యవతి రాథోడ్‌ను స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు సరైన సమయంలో స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై మంత్రిని నిలదీశారు. దీంతో ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను కలవకుండానే మంత్రి సత్యవతి రాథోడ్ తిరిగి వెనక్కు వెళ్లిపోయారు.
డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యను పలుపార్టీల నేతలతోపాటు, సినీ ప్రముఖులు, ప్రజాసంఘాలు, మహిళా కమిషన్, ఆద్యాత్మిక వేత్తలు, యోగాగురువులు అందరూ తీవ్రంగా ఖండించారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను గుర్తుకు తెచ్చిందన్నారు. ప్రియాంకారెడ్డి కుటుంబానికి ప్రగాడసానుభూతి తెలిపారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
రాహుల్ గాంధీ కూడా శంషాబాద్ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఘటన ఉహించుకునేందుకే భయంకరంగా ఉందని ట్వీట్ చేశారు. ఇక ప్రియాంకరెడ్డి హత్య అత్యంత హేయమైన ఘటన అని కేటీఆర్ అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు కేటీఆర్. ఈ దారుణానికి ఒడిగట్టిన క్రూర జంతువులను పోలీసులు కఠినంగా శిక్షిస్తారని అన్నారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
హైదరాబాద్‌లో ప్రియాంక హత్య అత్యంత బాధాకరమని జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సాధికారికత గురించి మాట్లాడుతున్న మనం రాత్రి 9గంటల సమయంలో కూడా మహిళలకు భద్రత కల్పించలేకపోతున్నామన్నారు.
ఇక సినీ నటి అనుష్క ఈ ఘటనపై స్పందించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని కౄరమృగాలతో పోల్చితే.. అవి సిగ్గు పడతాయని ట్వీట్ చేశారు. ప్రియాంక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నింధితులకు ఆలస్యం జరగకుండా శిక్షపడేలా అందరం కలిసిపోరాడదాం అని ట్విటర్ ద్వారా తెలిపారు.
హైదరాబాద్‌లో ప్రియాంక రెడ్డి కావచ్చు, తమిళనాడులో రోజా కావచ్చు లేదా రాంచీలో గ్యాంగ్ రేప్‌కు గురైన లా స్టూడెంట్ కావచ్చు.. ఇవన్నీ చూస్తుంటే మనం ఒక సమాజాన్ని కోల్పోతున్నట్టు అనిపిస్తోందని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అన్నారు. ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లు అయినా.. ఇప్పటికీ మన నైతిక వస్త్రం ముక్కలుగా చిరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలను మరింత కఠినంగా చేసుకోవాల్సిన అవసరం ఉందని.. ఇలాంటి ఘటనలు ఆగాలని అక్షయ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.