రాజధాని అంశంపై టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం

Update: 2019-11-30 02:42 GMT

ఆంధ్రుల రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు మరో ప్రయత్నం చేస్తోంది టీడీపీ. రాజకీయ పార్టీలు, నిపుణులు, ఉద్యోగ, ప్రజా సంఘాలతో వచ్చే నెల 5న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. రాజధానిపై ఆనాటి ప్రభుత్వం చేపట్టిన పనులు.. నేటి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు చంద్రబాబుపై దాడిని పార్లమెంట్ లో ప్రశ్నించాలని నిర్ణయించింది టీడీపీ.

ఏపీ రాజకీయాల్లో అమరావతి సెగలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించ తలపెట్టిన ఏపీ రాజధాని పట్ల ప్రస్తుత ప్రభుత్వం చూపుతున్న అలక్ష్యంపై టీడీపీ పట్టువిడవకుండా పోరాడుతోంది. రాజధానికి దాదాపు 40 వేల కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేయగా.. తమ హాయంలో 9 వేల కోట్లతో భవనాలు నిర్మించామన్నది టీడీపీ వాదన. అంతేకాదు.. రాష్ట్ర ఆర్ధిక రంగంపై భారం పడకుండా ఓ ప్రణాళికబద్ధంగా రాజధానికి నిధులను కేటాయించామని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే.. వైసీపీ మాత్రం రాజధానిలో నిర్మాణాలే లేవు అంటూ ఆరోపిస్తోంది. దీంతో నిజానిజాలు ప్రజలకు తెలియజేసేలా టీడీపీ ఎప్పటికప్పుడు కార్యక్రమాలను చేపడుతోంది. రాజధానిని రక్షించుకునేందుకు వచ్చే నెల 5న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.

రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ప్రజా సంఘాలు, నిపుణులతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. రాజధానిపై వాస్తవకతను చర్చించటంతో పాటు ఆనాటి ప్రభుత్వం ఆలోచనలు.. ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలపైనా చర్చించనున్నారు. ఇక ఇటీవల చంద్రబాబు అమరావతి పర్యటనలో జరిగిన దాడిని టీడీపీ సీరియస్ గా తీసుకుంది. దాడిపై కేంద్రాన్ని ఆశ్రయిస్తామని అంటున్నారు ఆ పార్టీ నేతలు. దాడిపట్ల డీజీపీ స్పందించిన తీరును కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేయాలని, అలాగే పార్లమెంట్ లోనూ ప్రస్తావించాలని నిర్ణయించింది. మంత్రుల మాట్లాడుతున్న తీరును టీడీపీ తప్పుబట్టింది.

ఏపీ ప్రభుత్వ విధానాల వల్ల పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నారని టీడీపీ అంటోంది. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు కూడా వెనక్కి వెళ్లి పోయాయని గుర్తుచేసింది.

Similar News