వణికించే చలిలో ఏపీ అసెంబ్లీ శీతాకాల రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించనున్నాయి. సోమవారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. ఈరోజు జరిగే బీఏసీ సమావేశంలో వింటర్ సెషన్ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.. అటు ఈ సమావేశాల్లో కీలకమైన బిల్లులు సభలో ప్రవేశపెట్టేందుకు అధికార పక్షం కసరత్తు చేస్తోంది. నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. అలాగే ఈ సెషన్‌లో సుమారు 20 అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. పాఠశాల విద్యావిధానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం వంటి.. అంశాలపై చర్చించాలని ప్రభుత్వం ప్రభుత్వం భావిస్తోంది. సమావేశాల తొలిరోజు దిశ ఘటనపై చర్చించి.. మహిళల భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలను ప్రభుత్వం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
అటు ప్రభుత్వ వైఫల్యాలపై సభలో గట్టిగా నిలదీసేందుకు ప్రతిపక్ష టీడీపీ కూడా వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ ఆరునెలల వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని ఇప్పటికే ఆ పార్టీ నిర్ణయించింది. మొత్తం 21 అంశాలను ఎంచుకున్న టీడీపీ నేతలు వీటిపై సమగ్ర చర్చ జరగాలంటే కనీసం రెండు వారాలైనా సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో పట్టుబట్టనుంది. ఉల్లి, నిత్యావసరాల ధరల పెరుగుదల, ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, ఇసుక ధర విపరీతంగా పెరిగిపోవడం, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, అమరావతి సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పనులు నిలిపివేయడం వంటి ప్రధాన సమస్యలు టీడీపీ ప్రశ్నావళలిలో ఉన్నాయి.. అలాగే సంక్షేమ పథకాల్లో కోత, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అనేక పథకాలు.. పనులు నిలిపివేత, బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూముల విక్రయాలు, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం.. దుబారా ఖర్చులు, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు.. వారి ఆత్మహత్యాయత్నాలు, ఉపాధి హామీ పథకం, హౌసింగ్ బిల్లుల పెండింగ్, ఇళ్ల నిర్మాణం నిలిపివేత, మీడియాపై ఆంక్షల జీవో, వలంటీర్ల నియామకంలో అక్రమాలు ఇలాంటి ఎన్నో అంశాలపై అధికార పార్టీని నిలదీసేందుకు వ్యూహాలకు పదును పెట్టింది టీడీపీ.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాగా సన్నద్ధమై సమావేశాలకు రావాలని, అన్ని రకాల చర్చల్లో చురుగ్గా పాల్గొని ప్రజల తరఫున గళం వినిపించాలని చంద్రబాబు ఇప్పటికే సూచించారు. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో వివిధ అంశాలపై వ్యక్తమవుతున్న నిరసనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ.. ప్రతి రోజు ఏదో ఒక సమస్యపై నిరసన కార్యక్రమాలు సభ ప్రారంభానికి ముందు చేపట్టేలా టీడీపీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది.