చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్.. సిట్ చేతికి కీలక ఆధారాలు

Update: 2019-12-10 01:37 GMT

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ చేతికి కీలక ఆధారాలు దొరికాయి. తొండుపల్లి వద్ద దిశను లారీలో తీసుకెళ్తుండగా సీసీ టీవీ కెమెరాలో నమోదైన దృశ్యాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు హైకోర్టు ఆదేశాలతో దిశ హత్యకేసు నిందితుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ కొనసాగుతోంది.

హైకోర్టులో జరుగుతున్న విచారణ గురువారానికి వాయిదా పడింది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణలో ఉండడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ లోపు ఎఫ్‌ఐఆర్ కాపీలు, డాక్యుమెంట్లు, పోస్టుమార్టం వీడియోకు సంబంధించిన సీడీలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే మృతదేహాలను ఏసీ ఆంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించాలని.. శుక్రవారం వరకు అక్కడే భద్రపర్చాలని స్పష్టంచేసింది. సీనియర్‌ లాయర్ ప్రకాష్‌రెడ్డిని మధ్యవర్తిగా సూచనలు ఇవ్వాలని సూచించింది. హైకోర్టు ఆదేశాలతో మూడు రోజులుగా మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీలో ఉన్న మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

హైకోర్టు సూచనతో అంత్యక్రియలకు బ్రేక్‌లు పడ్డాయి. ఎన్‌కౌంటర్‌ జరిగిన రోజే మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పచెప్పాలని పోలీసులు భావించారు. కానీ ఎన్‌ఎచ్‌ఆర్‌సీ బృందం విచారణతో వాయిదా పడింది.

మరోవైపు ఎన్‌ కౌంటర్‌ కేసును విచారిస్తున్న సిట్ సభ్యులతో రాచకొండ సీపీ ప్రత్యేకంగా సమావేశమై పలు సూచనలు చేశారు. మంగళవారం స్పాట్‌కు వెళ్లనున్న టీమ్‌.. కాల్పులకు దారి తీసిన పరిణామాలపై ఆరా తీయనుంది. దిశ హత్య సీన్ రీ కనస్ట్రక్షన్ సమయంలో ఏం జరిగిందనేదానిపై వివరాలు సేకరించనున్నారు. షాద్‌ నగర్‌ పోలీసుల నుండి ఎఫ్‌ఐఆర్‌తో పాటు.. స్వాధీనం చేసుకున్న వస్తులను పరిశీలించనున్నారు బృందం సభ్యులు.

మరోవైపు.. మృతదేహాలను తమకు అప్పగించాలని నిందితుల కుటుంబసభ్యులు కోరుతున్నారు. అటు గచ్చిబౌలిలోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ పోలీసుల్ని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం విచారించింది.

Similar News