ఏపీ రాజధానిపై శాసనమండలిలో కీలక ప్రకటన

Update: 2019-12-13 16:11 GMT

ఏపీ రాజధాని అమరావతేనా? లేక మారుస్తారా? ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేపిటల్ మార్పుపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి.. ఒక్కోమంత్రి ఒక్కోరకమైన ప్రకటన చేయడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తారని పుకార్లు షికారు చేశాయి. అటు ప్రభుత్వం కూడా కేపిటల్ అంశంపై నిపుణుల కమిటీని నియమించడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరించింది. నిపుణుల కమిటీ నివేదికలో ఏముంది? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఏపీ రాజధానిపై శాసనమండలిలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

శాసనమండలిలో ఏపీ రాజధానిపై టీడీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నలు అడిగారు. రాజధానిని మార్చే ఉద్దేశం ఉందా? అమరావతి కోసం ఇప్పటి వరకు ఖర్చుచేసిన నిధుల వివరాలేంటి? అని ప్రశ్నించడంతో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ లిఖిత పూర్వక సమాధానం చెప్పారు. మార్చే ఉద్దేశం లేదండి.. అని తన సమాధానంలో పేర్కొన్నారు మంత్రి. దీన్ని బట్టి ఏపీ రాజధాని అమరావతిలోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చినట్లయింది.

టీడీపీ హయాంలో రాజధాని విషయంలో భారీగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. రాజధానిపై విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్రావు నేతృత్వంలో కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ ప్రజల నుంచి సూచనలు తీసుకుంది. నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే తుది నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఇప్పుడు అదే మంత్రి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థ మ్యాప్‌ రిలీజ్‌ చేయడం కూడా కొంత గందరగోళానికి దారితీసింది. ఇది వివాదాస్పదంగా మారడంతో ఈ అంశాన్ని.. టీడీపీ లోక్‌సభలో ప్రస్తావించింది. దీంతో నవంబర్ 22న దేశ పటంలో అమరావతిని చేర్చుతూ కొత్త మ్యాప్‌ను విడుదల చేశారు.

Similar News