ఆంధ్రప్రదేశ్‌కు లెజిస్లేటివ్ కేపిటల్‌గా అమరావతి, ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖ, జ్యుడిషియల్ కేపిటల్‌గా కర్నూలు ఉండొచ్చన్న జగన్ మాటలు ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. మరోపైపు అమరావతి రైతులు నిరసలు చేపడుతున్నారు.
జగన్ నిర్ణయం అనాలోచిత నిర్ణయని మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ హైదరాబాద్‌లోని తన ఆస్తులు కాపాడుకునేందుకే.. అమరావతిని ముక్కలు చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలన్నదే సీఎం ఉద్దేశమా అని ప్రశ్నించారు.
రాజధాని విషయంలో ప్రభుత్వం ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని.. మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. విశాఖలో వైసీపీ నాయకులకు భూములు ఉన్నందువల్లే.. అక్కడ పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించారని ఆరోపించారు.
అసమర్ధులు అందలం ఎక్కితే రాష్ట్రం నాశనం అవుతుందని తాను ఎప్పుడో చెప్పానని టీడీపీ నేత బోండ ఉమ అన్నారు. అమరావతిని కట్టలేనివారు మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ఎద్దేవా చేశారు.
ఏపీ అభివద్ధి చెందాలంటే.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కానీ.. రాజధానుల వికేంద్రీకరణ కాదన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. పరిపాలన రాజధాని ఏర్పాటు చేసినంత మాత్రాన ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని ఆశించలేమని అన్నారు.
ప్రతిపక్షాల ఆరోపణలు కొట్టిపడేసింది ప్రభుత్వం.. రాజధానిపై కమిటీ నివేదిక వచ్చాకే తుది నిర్ణయం ఉంటుందన్నారు మంత్రి పేర్ని నాని. అసెంబ్లీలో కూడా జగన్ అదే విషయం చెప్పారని స్పష్టం చేశారు. చంద్రబాబులా సీఎం జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోరని అన్నారు.
మరోవైపు జగన్ ప్రకటనతో అమరావతి రైతులు పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తున్నారు. భవిష్యత్ తరాల కోసం భూములు ఇస్తే.. ఇప్పుడు రాజధానిని ముక్కలు చేయడం సరికాదని అంటున్నారు. జగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు.. లేకపోతే సమ్మె ఉద్రిక్తం చేస్తామని తెలిపారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల రైతలు తమ భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించారు
మొత్తానికి రాజధాని రగడతో ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల మంచికేనని ప్రభుత్వం చెబుతుంటే.. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.