అమరావతిలో రాజధాని రైతులు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. మూడు రాజధానుల ప్రకటనను ముఖ్యమంత్రి వెనక్కు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు.. ఆందోళన చేపట్టారు. అనంతరం ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. గురువారం రాజధాని బంద్‌కు రైతులు పిలుపునిచ్చారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో బంద్ చేపట్టనున్నారు. అలాగే గురువారం నుంచి రాజధానిలో సచివాలయం ఎదుట రిలే దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. అన్ని గ్రామాల రైతులు రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు.