అమరావతి గ్రామాలు అట్టుడుకుతున్నాయి. రైతుల నిరసనలతో రాజధాని ప్రాంతం హోరెత్తుతోంది. వెలగపూడిలో రైతులు దీక్షలు కొనసాగిస్తుండగా.. మందడంలో ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. రోడ్లకు అడ్డంగా ఫ్లెక్సీలు కట్టి నిరసన తెలుతుపుతున్నారు. జీఎన్‌రావు కమిటీ రిపోర్టుపై అక్కడి ప్రజలంతా భగ్గుమంటున్నారు. ఉదయం నుంచే చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ధర్నా శిబిరంలో రోడ్లపై పడుకుని నిరసన తెలుపుతున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.
వాహనాలను రానివ్వకుండా మందడం గ్రామంలో రోడ్లకు అడ్డంగా సిమెంట్ బెంచ్‌లు, ట్రాక్టర్లు అడ్డు పెట్టారు. టైర్లు తగలబెట్టారు. పోలీసులు అక్కడకు చేరుకుని వాటిని పక్కకు తొలగించారు. ఈ సందర్భంగా పోలీసులు, రైతులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉండటంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.
ఇటు వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. భూములిచ్చిన రైతులను సర్వనాశనం చేయడానికి ప్రభుత్వం సిద్ధపడిందంటూ అక్కడి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులందరినీ కూడగట్టుకుని ఉద్యమం చేపడతామంటున్నారు.