జీఎన్‌ రావు కమిటీ నివేదికను కేబినెట్‌ భేటీలో పెడతాం : మంత్రి బొత్స

Update: 2019-12-24 03:05 GMT

అమరావతి నుంచి రాజధానిని తరలించాలన్న పట్టుదలతో ఉంది వైసీపీ సర్కారు. ఇప్పటికే దీనిపై క్లారీటీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు మరింత స్పష్టత ఇచ్చింది. జీఎన్‌. రావు కమిటీ నివేదికను 27న జరిగే కేబినెట్‌ భేటీలో పెడతామన్నారు మంత్రి బొత్స సత్యానారాయణ. మంత్రివర్గంలో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తామని, గతంలో తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామన్నారు. విశాఖలో సీఎం క్యాంప్‌ ఆఫీసు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

అటు.. మంత్రి బొత్స వ్యాఖ్యలపై మండిపడుతున్నారు రాజధాని రైతులు. అమరావతి నుంచి రాజధాని తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 29 గ్రామాల్లో రైతులు రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలుపుతున్నారు. వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాత్రంతా మహిళలు, పిల్లలు... రిలే నిరాహారదీక్షల్లో కూర్చుని తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకుంటే తాము ప్రాణాలు అర్పించేందుకైనా సిద్ధమంటున్నారు రైతులు.

తుళ్లూరులోనూ రైతులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తాము పండించిన పంటలను చూపిస్తూ ఆందోళనలు చేసారు. మహాధర్నాలో రైతు దినోత్సవం సందర్భంగా రాజధానిలో పండే పంటలని దీక్ష వద్ద పెట్టిన రైతులు.. మిరప, పత్తి మొక్కలు ధరించి నిరసన తెలిపారు. అంతకుముందు రోడ్డుపై టెంట్‌ వేయకుండా అడ్డుకోవడంతో .. పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న రైతులు.. రోడ్డుపై టెంట్‌ వేసుకుని నిరసనలు కొనసాగించారు.

అటు మందడంలోనూ రైతులు రోడ్డుపై ధర్నాకు దిగారు. భిక్షాటన చేశారు. పోలీసుల్ని, సచివాలయం వెళ్లే ఉద్యోగులను ఆపి బిచ్చం అడిగి నిరసన తెలిపారు. రాజధాని ప్రాంతాన్ని స్పీకర్ ఎడారితో పోల్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెనుమాకలోని బొడ్రాయి కూడలిలో రైతులు ధర్నాకు దిగారు. తాడి కొండలో రైతుల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. మంగళగిరి, నిడుమర్రు, బేతపూడిలో టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతమయ్యాయి..

మరోవైపు రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తన కార్యాచరణ ప్రకటించింది. ఇవాళ కృష్ణాయపాలెంలో రైతులు రిలే నిరాహరదీక్ష చేయనున్నట్లు తెలిపింది. వెలగపూడి, తుళ్లూరు, మందడంలో ధర్నా, చలో హైకోర్టు పేరుతో న్యాయవాదుల ఆందోళన, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో రాజధాని రైతుల భేటీ, గవర్నర్‌తో సమావేశమై రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరరుతున్నారు. అటు... గుంటూరు కాకమానులోనూ రైతులు ధర్నా నిర్వహించనున్నారు.

Similar News