అమరావతిలో ఆరని నిరసన జ్వాలలు

Update: 2019-12-24 15:30 GMT

అమరావతిలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. జి.ఎన్‌ రావు కమిటీ నివేదికపై రైతులు నిప్పులు చెరుగుతున్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే ఊరుకోమంటూ హెచ్చరిస్తూ..పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.. వృద్ధులు, మహిళలు, చిన్నారులన్న తేడా లేకుండా ఆంతా ఆందోళనల్లో భాగమవుతున్నారు. ఎండను సైతం లెక్కచేయక మోకాళ్లపై కూర్చొని నిరసన తెలుపుతున్నారు. తమ ప్రాంతానికి అన్యాయం చేయొద్దంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెలగపూడిలో రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న దీక్షలు ఏడో రోజుకు చేరాయి.

రాజధాని రైతులంతా రోడ్డుపైకి వచ్చి వారం రోజులు అవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రధాని మోదీకి భారీ సంఖ్యలో లేఖలు రాశారు రైతులు. తమకు జరిగిన అన్యాయాన్ని మూడు పేజీల లేఖలో వివరించారు. ఆ లేఖలకు ఆధార్‌ జిరాక్స్‌లను జోడించారు. మూడు రాజధానుల నిర్ణయంపై వెంటనే ప్రధాని జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ స్పీడ్‌ పోస్టులో లేఖలను ప్రధాని కార్యాలయానికి పంపారు.

రాజధాని రైతులకు సంఘీభావంగా గుంటూరు జిల్లా వేల్పూరు గ్రామ రైతులు ధర్నా నిర్వహించారు. GN రావు కమిటీ ఇచ్చిన నివేదిక పూర్తిగా మోసపూరితమని ఆరోపించారు. రాజధాని నిర్మాణం కోసం 150 ఎకరాలు ఇచ్చిన మందడం గ్రామానికి చెందిన సుబ్బరావు, నాగరత్నమ్మ దంపతలను రాజధాని గ్రామాల రైతులు సన్మానించారు. వాళ్ల కాళ్లు కడిగి ఆ నీళ్లను నెత్తిన చల్లుకున్నారు. ఎన్నో త్యాగాలు చేసి తమ పోలాలను రాజధాని కోసం ఇచ్చామని.. తీరా ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.

రాజధానిని, హైకోర్ట్‌ను తరలించవద్దంటూ బెజవాడ బార్‌ అసోసియేషన్ సభ్యులు ఆందోళన నిర్వహించారు. వీరికి టీడీపీ నేతలు మద్దతు ప్రకటించారు. అటు.. ప్రకాశం జిల్లా ఒంగోలులో లాయర్లు విధులు బహిష్కరించి ఆందోళనలు చేపట్టారు.

రాజధానిని తరలించొద్దంటూ అమరావతి ప్రజలు చేస్తున్న ఆందోళనలకు వివిధ జిల్లాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. అమరావతి పరిరక్షణ సమితి పేరుతో విజయవాడలో నిరసనలు చేపట్టారు. అటు అనంతపురం వాసులు కూడా రైతులకు సంఘీభావం తెలిపారు.

Similar News