Ysr Vahana Mitra : ఇచ్చినది వేలు లాక్కొన్నది లక్షలు

వాహనమిత్ర లకు జగన్​ సర్కార్​ టోపీ

Update: 2024-04-29 03:00 GMT

ఆటో, ట్యాక్సీ ఉన్న డ్రైవర్లకు ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, రిపేర్ల కోసం ఏటా 10 వేల ఇస్తామన్నది జగన్‌ గత ఎన్నికల నాటి హామీ. కానీ రాష్ట్రంలో ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌లు 7.5 లక్షలు ఉంటే...జగన్‌ సర్కార్‌ 2.60 లక్షల మందికే సాయం అందించింది. డ్రైవర్లకు సొంత వాహనం ఉండాలన్న నిబంధనతో...మూడింట ఒక వంతు వాహనాల డ్రైవర్లకే సాయం దక్కింది. రాష్ట్రంలో ఆటోలను అద్దెకు తీసుకొని నడిపేవారే ఎక్కువమంది. దీంతో వారికి సాయం అందలేదు. కరెంట్‌ వినియోగం 300 యూనిట్లు దాటకూడదని, మూడెకరాల్లోపు మాగాణి, పదెకరాల్లోనే మెట్ట భూమి ఉండాలని, మున్సిపాలిటీల్లో వెయ్యి చదరపు అడుగులకు మించిన స్థలంలో ఇల్లు ఉండకూడదని, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, పింఛనుదారు ఉండకూడదన్న షరతులతో లక్షల మంది డ్రైవర్లకు పథకం వర్తించలేదు.

 వాహనమిత్ర పథకం కొందరు డ్రైవర్లకు ఏటా 10 వేలు చొప్పున అయిదేళ్లలో50 వేలు వైకాపా ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఇంతకు పదింతలుగా డ్రైవర్ల నుంచి జగన్‌ ప్రభుత్వం వసూలు చేసింది. రాష్ట్రంలో చమురు ధరలు ఇతర రాష్ట్రాల కన్నా కనీసం పది రూపాయలు ఎక్కువగా ఉండటంతో డ్రైవర్లు అల్లాడిపోయారు. ఒక డ్రైవర్‌ రోజుకు సగటున 10 లీటర్ల డీజిల్‌ వినియోగిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి రోజూ 110 రూపాయలు, నెలకు 3 వేల 300, ఏడాదికి సుమారు 40 వేలు చొప్పున అయిదేళ్లకు 2 లక్షల మేర జగన్‌ ప్రభుత్వానికి కట్టక తప్పలేదు. గతంలో ఆటో డ్రైవర్ల పొరపాట్లకు, పత్రాలు లేకున్నా... రవాణా శాఖ అధికారులు, పోలీసులు కాస్త ఉదారంగా ఉండేవారు. నామమాత్రపు జరిమానాలు విధించేవారు. కానీ జగన్‌ ప్రభుత్వం డ్రైవర్లను తీవ్రస్థాయిలో ఇబ్బంది పెట్టింది. డ్రైవర్ల ప్రతి చిన్న పొరపాటుకీ భారీ జరిమానాలతో వాతలుపెట్టింది. వాస్తవానికి 2020లో కేంద్రం రవాణా నిబంధనల ఉల్లంఘనలకు జరిమానాలను పెంచింది. వీటిపై ఏరాష్ట్రమూ ముందుకు వెళ్లకున్నా... జగన్‌ ప్రభుత్వం మాత్రం అమలుకు ఉత్తర్వులిచ్చింది.అనేక జరిమానాల రూపంలో ఒక్కో డ్రైవర్‌పై ఏడాదికి సగటున 30 వేల వరకు భారం పడగా...అయిదేళ్లలో ఒక్కో డ్రైవర్‌ లక్షన్నర చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. కొందరు మూడు లక్షల వరకూ చెల్లించాల్సి వచ్చింది.

జగన్‌ పాలనలో రోడ్లకు అధ్వాన దుస్థితి దాపరించింది. గుంతలమయం అయిన రోడ్లపై ఆటోలు నడుపుతుంటే తరచూ షెడ్డ్‌ ముఖం చూడాల్సిందే. ఆటోల వెనుక చక్రాల బేరింగ్స్‌ విలవిల్లాడుతున్నాయి. మూడేళ్లు ఉండే క్లచ్‌పేట్లు ఏడాదికే పాడవుతున్నాయి. 40 వేల కిలోమీటర్లు రావాల్సిన టైర్ల జీవితకాలం.. 30 వేలకు పడిపోయింది. టైర్లకు తరచూ పంక్చర్లే. గతంలో లీటర్‌కు 30 కిలోమీటర్లు వచ్చే మైలేజ్‌ 20 నుంచి 25 కిలోమీటర్లే వస్తోంది. ఆటో నిర్వహణ ఖర్చు 3 వేలు దాటే పరిస్థితి. ఇలా అయిదేళ్లలో లక్షా 80 వేలు చొప్పున వాహనాల మరమ్మతులకే డ్రైవర్లు ఖర్చు చేశారు. వాహన మిత్ర సాయం మాట దేవుడెరుగు ముందు రోడ్లు బాగుంటే అదే పదివేలన్నది చాలా మంది డ్రైవర్ల మాట.

Tags:    

Similar News