టీడీపీ నుండి టీఆర్ఎస్ లో చేరారు.. అయినా అభివృద్ధిలో మార్పు లేదు

Update: 2019-12-26 04:39 GMT

రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ హైద‌రాబాద్‌కు కూత వేటు దూరంలో ఉంది. అయినా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. గ‌తంలో గ్రామ పంచాయితీగా ఉన్నప్పుడు ఎలా ఉందో మున్సిపాల్టీగా మారాక అదే తీరు. ఈ మున్సిప‌ల్టీ పరిధిలో ఇబ్రహీంపట్నం, శేరిగూడ‌, సీతారాంపేట్‌, ఖానాపూర్‌లు ఉన్నాయి. ఇందులో 24 వార్డులకు 23వేల మంది ఓట‌ర్లున్నారు. ఇబ్రహీంప‌ట్నం మున్సిపాల్టీ 2013లో ఏర్పాటైంది. ఇక 2014లో టీడీపీ నుండి గెలుపోందిన వారు అభివృద్ధి నెపంతో 2016లో టిఆర్‌ఎస్‌లో జాయిన్ అయ్యారు. అయినా మున్సిపాలిటీ తీరు మారలేదు..

ప్రధానంగా ఇబ్రహీంప‌ట్నం మున్సిపాల్టీలో తాగునీటి స‌మ‌స్య వేధిస్తుంది. దీనికి తోడు అస్థవ్యస్థమైన డ్రైనేజీ వ్యవ‌స్ధతో దోమ‌లు ప్రజల రక్తాని పీల్చేస్తున్నాయి. ఈగల గోల పెరిగింది. గ‌తంలో ఇక్కడ మంచినీటి కోసం ధ‌ర్నాలు చేసిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయ‌నే చెప్పాలి. దీనికి తోడు పందుల స‌మ‌స్య తీవ్రంగా వేధిస్తోంది.

కూరగాయల మార్కెట్‌ కూడా సమస్యగానే మారింది. ఇప్పటికే మూడు సార్లు అమ్మే వారి స్ధలాలు మార్చడంతో ఇబ్బందికి గురవుతున్నారు. తాజా కూర‌గాయాల కోసం మార్కెట్‌ కడతామని శంకుస్థాపన చేసినా పనులు ముందుకు పడలేదు.

పాత‌బ‌స్ స్టాండ్ బూతు బంగ్లాను త‌ల‌పిస్తుంది. అప‌రిశుభ్రమైన వాతావ‌ర‌ణం రాజ్యం మేలుతోంది. తాగుబోతుల‌కు అడ్డాగా మారింది. దీనికి తోడు పాత పోలీస్ స్టేష‌న్ స్ధానంలో కొత్త బిల్డింగ్ కోసం శంకుస్ధాప‌న చేశారు. అదే స్థానంలో మ‌హిళ భవ‌నం కోసం, స‌బ్ రిజిస్ట్రేష‌న్ కోసం, మిష‌న్ భ‌గీర‌థ కోసం శిలాఫలకాలు వెలిశాయి. నిర్మాణాల విషయంలో అడుగు కూడా ముందుకు పడలేదు. అంబేద్కర్ భ‌వ‌నం నిర్మిస్తామ‌ని శిలాఫ‌ల‌కం వేసారు ఆ డ‌బ్బులు ఏమైయ్యాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు..

ఇక్కడి అక్రమ వెంచ‌ర్లు గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిద‌నే చెప్పాలి. 2018 వ‌ర‌కు పాల‌క మండ‌లి ఉన్న గ్రామపంచాయితీ పేరుతో ప్లాట్ల అమ్మకాలు జ‌రిగాయంటే దీని ప‌రిస్ధితి ఇట్టే అర్ధం అవుతుంది. వీధి లైట్ల స‌మ‌స్య ఈ మున్సిపాల్టీని వేధిస్తోంది. స‌రైన పార్కింగ్ వ‌స‌తులు కూడ లేక‌పోవ‌డంతో నానా ఇబ్బందులు ప‌డుతున్నారు స్థానికులు. ఇబ్రహీంప‌ట్నం టౌన్‌లో దాదాపు 16 వ‌ర‌కు మిని వాట‌ర్ ట్యాంకులు ఉన్నాయి. అందులో చుక్క నీరు కూడా ఉండదు. ఇక్కడ ఉన్న ఓ ఒక్క హ‌స్టల్‌కు ప‌క్కాభ‌వ‌నం లేదు.

చాలా వ‌ర‌కు ఇబ్రహీంప‌ట్నం మున్సిపాల్టీలో చాలా సమస్యలను పరిష్కరించామని.. అక్కడ‌క్కడ కొన్ని స‌మ‌స్యలు ఉన్న మాట వాస్తవ‌మ‌ని గ‌త పాల‌క వ‌ర్గం చేబుతోంది. త‌మ‌పై ఎలాంటి అవినీతి ఆరోప‌ణ‌లు లేవని కొట్టి పారేస్తున్నారు.

ప్రధానంగా రోడ్డు స‌మ‌స్య అధికంగా ఉంది. పేరుకే సాగ‌ర్ హైవే.. కానీ ఎక్కడ చూసినా ఇరుకు రోడ్డే కనిపిస్తుంది. నాలుగు లైన్లు చేస్తామ‌ని చెప్పినా ఇంత వ‌ర‌కు అమలుకు నోచుకోలేదు. ఇలా అడుగడుగునా సమస్యలే దర్శనమిస్తాయి.

Similar News

TG: యమ"పాశం"