చలి పంజా.. గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Update: 2019-12-30 12:29 GMT

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి గుప్పిట్లో చిక్కుకుంది. రాత్రిపూట రోజురోజుకి ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. చలి దాటికి జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. గత రెండు రోజుల్లోనే చలి తీవ్రతకు 10 డిగ్రీలకు పడిపోయింది. తీవ్రమవుతున్న చలితో జనం గజగజ వణికిపోతున్నారు. రాత్రిపూట రెండు రోజుల క్రితం 17 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 6, 7 డిగ్రీలకు చేరుకుంటున్నాయి.

ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి మండలం అర్లి-టి గ్రామంలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడ 70 ఏళ్ల ఓ ముసలవ్వ చలికి చనిపోగా.. ఆస్థమా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉదయం 11 గంటలు దాటినా.. బయటికి రావాలంటే జనం వణికిపోతున్నారు. పొలం పనులకు వెళ్లాలన్నా.. బయటికి అడుగు వేయలేకపోతున్నారు. పగటిపూట కూడా చల్లటి గాలులు వీస్తుండటంతో.. రోజువారి పనులు చేసుకోలేకపోతున్నారు.

సాయంత్రం 6 గంటల వరకు చలి తీవ్రత పెరుగుతుండటంతో.. మంటలు కాచుకుని సేదతీరుతున్నారు స్థానికులు. తూర్పు రాష్ట్రాల నుంచి వీస్తున్న గాలుల ప్రభావం మరో మూడు, నాలుగు రోజుల వరకు ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉష్ణోగ్రతలు మరో మూడు డిగ్రీలు పడిపోయే అవకాశం ఉన్నందును.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Similar News