AP: తిరుమల పవిత్రతను కాపాడతాం
విజయభేరి సభలో పవన్,చంద్రబాబు హామీ.... జగన్ పాలనపై విమర్శలు;
ఆధ్యాత్మిక కేంద్రాన్ని రిసార్ట్‌గా మార్చి దెబ్బ తీసిన తిరుమల పవిత్రతను తిరిగి పునరుద్దరిస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. వారాహి విజయభేరీ సభలో పాల్గొన్న నేతలు గడిచిన 5 సంవత్సరాల జగన్ పాలన పై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. తిరుపతి అభివృద్దికి చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. తిరుపతిలో నిర్వహించిన వారాహి విజయభేరీ సభ విజయవంతమయ్యింది. పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు లీలామహల్ కూడలి నుంచి నాలుగుకాళ్ళ మండపం వరకు చేపట్టిన రోడ్ షోకు జనం పోటెత్తారు. ముందుగా ప్రకటించిన మేరకు లీలామహల్ కూడలి నుంచి రోడ్ షో ప్రారంభమవ్వాల్సి ఉండగా అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావడంతో మంగళం సమీపంలోని ఆశా కన్వన్షన్ సెంటర్ నుంచి ర్యాలీ సాగింది. దాదాపు రెండు కిలో మీటర్ల పాటు సాగిన రోడ్ షోకు ప్రజలు భారీగా తరలిరావడంతో దాదాపు రెండున్నర గంటల పాటు సాగింది. రోడ్ షో సాగుతున్న ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రదర్శన చీకట్లోనే సాగింది.
రోడ్ షో అనంతరం నాలుగుకాళ్ళ మండపం వద్ద జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కల్యాణ్ టీటీడీ చైర్మన్ పై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వారికి ఎందుకు ఓటేయ్యాలని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలను సెలవ విడిదీ కేంద్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో దళారీ రాజ్యమేలుతోందని... టీటీడీ కాంట్రాక్ట్ పనుల్లో 12 శాతం కమీషన్ తీసుకుని ఆదాయవనరుగా మార్చుకున్నారని ఆరోపించారు. తితిదే ఉద్యోగుల ఇంటి పట్టాల పై జగన్ బొమ్మ ఎందుకని ప్రశ్నించారు. కరుణాకర రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి రౌడీయిజానికి భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వస్తే తితిదే నిధులను ప్రజా సంక్షేమానికి వినియోగిస్తామన్నారు.
తిరుపతిని అన్ని రంగాల్లో అభివృద్ది చేసిన ఘనత మాదేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో దొంగలు పడ్డారని వారిని ఎదుర్కునేందుకు ప్రజలు సిద్దంగా ఉండాలన్నారు. ఎన్టీఆర్, చిరంజీవి ఇక్కడి నుంచే పోటీ చేశారని పోత్తుల్లో భాగంగా తిరుపతి సీటును జనసేనకు కేటాయించామని చంద్రబాబు తెలిపారు. కూటమి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని తెలిపారు. తిరుపతిలో గరుడ వారధి, చంద్రగిరి బైపాస్ రహదారిని నిర్మించామని గుర్తు చేశారు. IIT, IISER ఏర్పాటు ద్వారా తిరుపతిని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దామన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.