ఇసుక విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Update: 2019-12-31 03:50 GMT

ఇసుక విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి డోర్ డెలివరీ చేయనుంది. మరోవైపు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా అక్రమాలకు చెక్ పెట్టనుంది. జనవరి 2న కృష్ణా జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఇసుక డోర్‌ డెలివరీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇసుక పాలసీ, అమలు తీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇసుక పాలసీకి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 7న ఉభయ గోదావరి, కడప జిల్లాల్లో డోర్‌ డెలివరీ ద్వారా ఇసుక అందించాలని నిర్ణయించారు. జనవరి 20 నాటికి అన్ని జిల్లాల్లో ఇసుక డోర్‌ డెలివరీ ప్రారంభించాలని తెలిపారు. దీనికోసం రోజుకు 2.5 లక్షల టన్నుల చొప్పున ఇసుక సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే వర్షాకాలాన్ని దృష్టి పెట్టుకొని పటిష్ట ప్రణాళికలతో ముందుకెళ్లాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. వర్షాకాలంలో పనుల కోసం ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు 15 లక్షల టన్నుల ఇసుకను సిద్ధం చేయాలన్నారు. సుమారు 60 లక్షల టన్నుల ఇసుకను స్టాక్‌ చేసుకోవాలని తెలిపారు.ఇసుక సరఫరా వాహనాలకు అమర్చే జీపీఎస్‌పైనా సీఎం జగన్‌ ఆరా తీశారు. చెక్‌పోస్ట్‌లు, సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా ఇసుక సరఫరాను పర్యవేక్షించనున్నారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయనున్నారు.

Similar News