అమరావతి కోసం త్వరలో జనసేనాని కవాతు

Update: 2020-01-10 02:07 GMT

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. బస్సు యాత్రలతో హోరెత్తిస్తున్నారు. ఐతే.. ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు.. నిర్బంధాలు.. కేసులు.. రైతుల్ని అవమానించేలా మాటలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ కూడా ప్రత్యేక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాజధాని గ్రామాల్లో పర్యటించిన పవన్ రైతులకు భరోసా ఇచ్చారు. స్వార్థం కోసమే జగన్‌ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ రోజు పవన్‌ పర్యటన ముందుకు సాగకుండా పోలీసులు ముళ్ల కంచెలు వేయడంతో దాదాపు పది కిలీమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

ఈ వారం రోజుల్లో రాష్ట్రంలో పరిణామాలు మారిపోయాయి. ప్రజల ఆందోళనలకు ఏమాత్రం ప్రభుత్వం విలువ ఇవ్వకుండా.. ముందుకు సాగుతోంది. ఐతే.. ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ.. జనసేనాని కవాతు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే దీనిపై జనసేన పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌.. అన్ని జిల్లాల నేతలతో మాట్లాడుతున్నారు. ఇటీవల జనసేన ముఖ్యనేతలతో సమావేశమైన పవన్.. పాలన ఒకచోట.. అభివృద్ధి అనేక చోట్ల నినాదంతో జనసేన ముందుకు సాగుతుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో విజయవాడలో లక్ష మందితో నిర్వహించే కవాతుపై మరోసారి సమావేశమై కార్యాచరణ ప్రకటించాలని ముఖ్యనేతలు నిర్ణయించారు. అమరావతికి మద్దతుగా జిల్లాల్లో కూడా జనసేన ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం మారితే రాజధాని మార్చాలనే ఆలోచన సరికాదని.. రాజధాని రైతులకు అండగా ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమైన జనసేన ప్రకటించింది.

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో పవన్‌ కళ్యాణ్‌ సమావేశం కానున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నేతల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ఇదే సమావేశంలో లక్ష మందితో చేపట్టే కవాతుపై కూడా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

Similar News