మందడంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన రైతుల ర్యాలీ

Update: 2020-01-11 10:21 GMT

మందడంలో రైతుల ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రైతులు, మహిళల్ని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పలువురిని అరెస్ట్ చేశారు. కావాలనే కక్షకట్టినట్టు వ్యవహరిస్తూ తమను నిర్బంధిస్తున్నారని మందడం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను చిత్రహింసలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు బూతులు తిడుతూ, మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. అటు, తమ ర్యాలీని మొబైల్‌లో షూట్ చేస్తున్న వ్యక్తిని అడ్డుకున్నారు. అతను ఎవరు, ఎందుకు వచ్చాడని నిలదీశారు. అతని నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. పట్టుకుని ఓ గదిలో బంధించే ప్రయత్నం చేశారు. డిపార్ట్‌మెంట్‌ నుంచి వచ్చానని ఒకసారి, యూట్యూబ్ చానెల్ కోసం అని ఒకసారి అతను పొంతనలేని సమాధానాలు చెప్పడమే ఈ వివాదానికి కారణంగా చెప్తున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు అతన్ని విడిపించి తీసుకెళ్లారు. అతన్ని పట్టుకున్న రైతును కూడా బలవంతంగా అదుపులోకి తీసుకుని వ్యాన్‌లో తరలించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

మందడంలో రోడ్డుపై నిరసన తెలిపేందుకు ఉదయం నుంచి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎటు చూసినా దిగ్భందమే కనిపించింది. చివరికి మధ్యాహ్నం రైతులు ర్యాలీ చేపట్టడం.. ఆ వెంటనే పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో మరోసారి రణరంగంగా మారింది. ఈ ఘర్షణలో ఓమహిళకు చెయ్యి విరిగింది. ఇది గ్రామస్థులకు మరింత కోపం తెప్పిచింది. ఖాకీలు అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారంటూ మహిళలు కోపంతో ఊగిపోయారు. శత్రువుల్ని చూసినట్టు తమను దారుణంగా ట్రీట్ చేస్తున్నారని కన్నీరు పెట్టారు.

Similar News