శాసనమండలి ముందుకు మూడు రాజధానుల బిల్లు

Update: 2020-01-21 09:33 GMT

ఊహించిందే జరిగింది. ఏపీకి మూడు రాజధానుల నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి నుంచి మారుతోంది. ఇకపై విశాఖపట్నం పరిపాలన రాజధానిగా కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. హైకోర్టుతోపాటు న్యాయ వ్యవస్థకు సంబంధించిన విభాగాలన్నీ కర్నూలులో కొలువు తీరుతాయని స్పష్టం చేసింది. రాజధాని రైతుల ఆందోళనలు, విపక్షాల అభ్యంతరాలను అన్నింటినీ పక్కన పెట్టి.. పరిపాలన వీకేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. మూడు రాజధానులతో పాటు సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లును కూడా అసెంబ్లీలో ఆమోదిచింది.

సోమవారం ఉదయం 11 గంటలకు మొదలైన అసెంబ్లీ రాత్రి 11 గంటల వరకు.. అంటే సరిగ్గా 12 గంటలపాటు సుదీర్ఘంగా వాడివేడి చర్చ జరిగింది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ విపక్ష టీడీపీ.. మూడు రాజధానులే ముద్దు అంటూ అధికారపక్షం వైసీపీ సభ్యులు హోరాహోరీగా తమ వాదనలు వినిపించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్, భారీగా నిధుల అవసరం వంటి కారణాలను వివరిస్తూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ మంత్రి బుగ్గన బిల్లును ప్రవేశపెట్టారు. విపక్ష అభ్యంతరాల తరువాత.. మూడు రాజధానుల ఆవశ్యకతపై సీఎం జగన్‌ సుదీర్ఘంగా సభలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే.. సేవ్‌ అమరావతి అంటూ సభలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో వారిని సస్పెండ్ చేసి.. జగన్‌ తన ప్రసంగం కొనసాగించారు.

జగన్‌ ప్రకటన తరువాత ఆంధ్రప్రదేశ్ పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లు - 2020ను అసెంబ్లీ ఆమోదించింది. మరోవైపు ఇప్పటి దాకా అమరావతి నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించిన సీఆర్డీయేను మరో బిల్లుద్వారా రద్దు చేశారు. ఇక ఈ మూడు రాజధానుల బిల్లు మంగళవారం శాసన మండలికి రానుంది. అక్కడ విపక్షానిదే ఆధిక్యం ఉండడం.. బిల్లు భవిష్యత్తుపై సందేహం నెలకంది. అయినా ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు.

Similar News