రైతుల ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం

Update: 2020-01-21 12:37 GMT

అమరావతిలో ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 29 గ్రామాల నుంచి ఎవరినీ బయటకు రానివ్వకుండా ఆంక్షలు పెట్టారు. 144 సెక్షన్‌తోపాటు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందంటూ ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కశ్మీర్‌ను మించిన టెన్షన్ వాతావరణం ఎందుకు సృష్టిస్తున్నారంటూ రైతులు ఈ పరిస్థితిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా వాహనాలు కూడా రోడ్లపై తిరగొద్దని ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సోమవారం 10 వేల మంది బందోబస్తు ఉంటే మంగళవారం 12 వేల మందితో అడుగుకో పోలీసును ఉంచడం ఏంటని నిలదీస్తున్నారు. పోలీసులు గ్రామాల్లో వీరంగం సృష్టిస్తున్నారని తామేం తప్పు చేశామని ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ఫ్యూలాంటి వాతావరణం ఉందని, ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించినా తాము పోరాటం కొనసాగించి తీరతామని అంటున్నారు.

Similar News