తెలుగు రాష్ట్రాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Update: 2020-01-26 22:13 GMT

గణతంత్ర దినోత్సవాన్ని విజయవాడలో నిర్వహించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి, సీఎస్ సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను తన ప్రసంగంలో వివరించారు గవర్నర్. మూడు రాజధానులనూ ప్రస్తావించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకలు నిర్వహించింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన తమిళిసై.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తన ప్రసంగంలో వివరించారు.

పార్టీ ఆఫీసుల్లో గణతంత్ర వేడుకల్ని నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ జెండా ఆవిష్కరించారు. గాంధీభవన్, బీజేపీ ఆఫీసుల్లోనూ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. హిందూయిజం అంటే మతం కాదని భారతీయమని అన్నారు పవన్ కల్యాణ్. భవిష్యత్ తరాల కోసం త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపిచ్చారు.

గణతంత్ర దినోత్సవాన్ని హైదరాబాద్‌లోని టీవీ5 ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. భరతమాత చిత్రపటానికి కొబ్బరికాయ కొట్టారు సంస్థ ఎండీ రవీంద్రనాథ్‌. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారాయన. మువ్వన్నెల జెండాకు వందనం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. దేశభక్తి గీతాలను ఆలపించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.

Similar News