మేడారంలో వనదేవతలకు సీఎం కేసీఆర్ మొక్కులు

Update: 2020-02-08 08:29 GMT

తెలంగాణ కుంభమేళ మేడారానికి భక్తజనం పోటెత్తింది. సమ్మక్క- సారలమ్మల దర్శనభాగ్యం కోసం మేడారానికి బారులు తీరుతున్నారు. చీర, సారె, నిలువెత్తు బంగారాన్ని సమర్పించి వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఈసారి కూడా వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. హెలికాఫ్టర్‌లో మేడారం చేరుకుని సమ్మక్క, సారలమ్మ దర్శనం చేసుకున్నారు. వనదేవతల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత చీర, సారె సమర్పించారు. అలాగే తల్లులకు నిలువెత్తు బంగారం కూడా కానుకగా ఇచ్చారు. గిరిజన పూజారులతో కలిసి ఆచారం ప్రకారం జరగాల్సిన సంప్రదాయాలన్నీ పూర్తి చేశారు. బంగారు తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని దేవతలను కోరుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ ఉన్నారు. దర్శనానంతరం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సమ్మక్క-సారలమ్మ దేవతల ఫోటో అందజేశారు.

సాధారణ ప్రజలే కాదు.. ప్రజాప్రతినిధులు మేడారానికి క్యూకట్టారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ వనదేవతలను దర్శించుకున్నారు. వారికి అధికారులు ఘనస్వాగతం పలికారు. సమ్మక్క, సారలమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ వనదేవతల ఆశీర్వాదాలు ఉండాలని ఆకాంక్షించారు. సమ్మక్క, సారలమ్మ జాతర ప్రకృతితో మమేకమైందని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు.

అశేష భక్తుల నుంచి తీరొక్క మొక్కులు అందుకున్న వనదేవతలు శనివారం వనప్రవేశం చేయనున్నారు. జాతరలో చివరి అంకమైన ఈ ఘట్టం సాయంత్రం జరగనుంది. తొలుత నలుగురు దేవతల పూజారులు గద్దెల వద్ద పూజలు చేసి ఆపై సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరునాగారం మండలం కొండాయికి, సమ్మక్కను మేడారం సమీపంలోని చిలకలగుట్టపైకి తీసుకెళ్తారు. ఈ సమయంలో గద్దెల వద్ద ఉన్న భక్తులకే వనప్రవేశాన్ని చూసే వీలు ఉంటుంది. ఆలయం దాటిన తర్వాత బయటివారినెవరినీ వెంట రానివ్వరు. అందుకే ఈలోగానే అమ్మవార్లను దర్శనం చేసుకోవాలని భక్తులు భారీగా వస్తున్నారు.

మేడారం జాతర.. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్దికెక్కింది. దీంతో దేశ నలుమూల నుంచి అమ్మవార్ల దర్శణానికి భక్తులు తరలివస్తున్నారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇప్పటివరకు కోటి 10 లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్టు అధికారులు అంచనా వేశారు. శనివారం మరో 40 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేశారు అధికారులు.

 

Similar News