వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు దిశ ఘటనపై అయన ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవలనే ఆయన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నిందితుడు చెన్నకేశవులు భార్యతో మాట్లాడారు. దిశపై అత్యాచారానికి పాల్పడి తిరిగి ఇంటికొచ్చిన తర్వాత చెన్నకేశవులు ప్రవర్తన, వారింటికి పోలీసులు ఎన్ని గంటలకు వెళ్లారనే విషయంపై వర్మ ఆరా తీశారు. మరోవైపు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన రామ్‌గోపాల్ వర్మ అక్కడి పోలీసులను కలుసుకున్నారు. దిశ ఘటనపై సినిమా తీయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. దిశ కుటుంబంతో సినిమా విషయంపై ఇంకా మాట్లాడలేదని పేర్కొన్నారు. అన్ని అంశాలను సినిమాలో చూపిస్తానని వెల్లడించారు. దిశ సినిమా తీయడానికి ఎవరి అనుమతి అవసరం లేదన్నారు వర్మ. గతంలో టీవీ5 స్టూడియోకు వచ్చిన వర్మ దిశ ఘటనపై సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు.