తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే బాధ్యత.. కొత్తగా ఎన్నికైన మేయర్లు, ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై ఉందన్నారు సీఎం కేసీఆర్. ప్రగతిభవన్‌లో జరిగిన మున్సిపల్ సమ్మేళనంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు కర్తవ్య బోధ చేశారు. ఐదు కోట్ల మందిలో 140 మందికే మేయర్లు, ఛైర్ పర్సన్లు అయ్యే అవకాశం వచ్చిందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గెలిచేంత వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యమని స్పష్టం చేశారు కేసీఆర్.
మున్సిపాల్టీ అంటేనే మురికి, చెత్త, అవినీతికి పర్యాయపదంగా మారిందని అన్నారు సీఎం. అందుకే బల్దియా..ఖాయా..పీయా..చల్దియా వంటి సామెతలు వచ్చాయని చెప్పారు. ఆ చెడ్డ పేరు పోవాలంటే...పారదర్శకమైన విధానాలు అవలంభించాలని సూచించారు. అన్నిపనులు ఓవర్‌నైట్‌లో చేస్తామని చెప్పొద్దని..ఫోటోలకు ఫోజులు తగ్గించి పనులపై దృష్టిపెట్టాలని అన్నారు. సమావేశంలో పలు పద్యాలు చదివి..వాటికి అర్థం చెప్పారు సీఎం కేసీఆర్. సమావేశంలో పలు పద్యాలు చదివి..వాటికి అర్థం చెప్పారు సీఎం కేసీఆర్.
ప్రగతిభవన్‌లో దాదాపు 4 గంటలపాటు మున్సిపల్ సమ్మేళనం జరిగింది. పట్టణ ప్రగతికి సంబంధించి ప్రభుత్వ లక్ష్యాలు, ప్రణాళికలు, ఆలోచనలపై సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈనెల 24 నుంచి 10 రోజులపాటు జరగనున్న పట్టణ ప్రగతి కార్యక్రమం విదివిధానాలు ఖరారు చేశారు. పచ్చదనం, పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.
అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు, పలువురు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పర్యటనకు వెళ్లారు. అక్కడున్న శాఖాహార, మాంసాహార మార్కెట్లను పరిశీలించారు. కొందరు నేతలు రైతుల నుంచి కూరగాయలు కొనుగోలు చేశారు. సింగాయిపల్లి ఫారెస్ట్ పార్కును కూడా సందర్శించింది మున్సిపల్ బృందం.