మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల అభివృద్ధిపై దృష్టిసారిస్తున్నారు సీఎం కేసీఆర్. ఈ నెల 24 నుంచి పది రోజుల పాటు పట్టణ ప్రగతి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించే పనిలో వున్నారు. ఇందులో భాగంగా ప్రగతి భవన్ వేదికగా పట్టణ ప్రగతి ప్రణాళిక కోసం సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నూతనంగా ఎన్నికైన కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాల్ చైర్మన్లతో పాటు అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆహ్వానించింది. తొలిసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం అందింది.
ప్రభుత్వం నుంచి వచ్చిన ఆహ్వానంపై కాంగ్రెస్ శాసనసభ్యులు తీవ్ర తర్జన భర్జన పడ్డారు. ఇదే అంశంపై చర్చించేందుకు సీఎల్పీ కార్యాలయంలో భేటీ అయిన భట్టి విక్రమార్క ప్రగతి భవన్ సమావేశానికి కిందిస్థాయి అధికారుల నుంచి తమకు ఫోన్ చేసి పిలవడం మమ్మల్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చర్చల తర్వాత ప్రగతి భవన్ సమావేశానికి దూరంగా ఉండాలని సీఎల్పీ నిర్ణయించింది.
కార్పోరేషన్లు మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై సీఎం కేసీఆర్ చెబుతున్న మాటలు ప్రజల్ని మభ్య పెట్టేలా ఉన్నాయని కాంగ్రెస్ శాసనసభాపక్షం మండిపడుతోంది. పట్టణాలకు ఒక్కపైసా కేటాయించకుండా అభివృద్ధి ప్రణాళికలు అంటూ కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని హస్తం పార్టీ ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడి అధికార, దుర్వినియోగం, డబ్బు, మద్యం, తో ఎన్నికల ప్రక్రియ అపహాస్యం చేశారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు అడ్డదారిన మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకున్న మేయర్లు, చైర్మన్లతో కేసీఆర్ సమావేశం పెట్టుకుంటే తాము వెళ్లాల్సిన అవసరం లేదని మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేని కేసీఆర్ ప్రధాన ప్రతిపక్షం లేకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే నమ్మకం లేని, ప్రతిపక్షాల అంటే గౌరవం లేని ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశానికి తాము వెళ్లకపోవడమే ఉత్తమమని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా ప్రభుత్వం నుంచి తొలిసారి ఆహ్వానం అందినా ప్రగతి భవన్ సమావేశానికి దూరంగా వున్న హస్తం నేతలు.. కేసీఆర్‌పై నిరసన వ్యక్తం చేసేందుకు ఒక అవకాశంగా మలుచుకున్నామని చెబుతున్నారు.