రాయచోటిలో ఘనంగా ప్రారంభమైన శ్రీ భద్రకాళీ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు

Update: 2020-02-19 17:29 GMT

దక్షిణ కాశీగా పేరుగాంచిన కడప జిల్లా రాయచోటిలోని.. శ్రీ భద్రకాళీ శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 11 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు.. ఆలయ ఈవో మంజుల తెలిపారు. 20న కళ్యాణోత్సవం, 24న పూలంగిసేవ, 25న నంది వాహనోత్సవం జరుగనుంది. ఇక, 26న అగ్నిగుండ ప్రవేశం, మహానైవేద్యం, రథోత్సవం నిర్వహించనున్నారు. 28న అశ్వవాహన సేవ ఉంటుందని ఈవో అన్నారు.

ఈ బ్రహ్మోత్సవాలకు ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్దయెత్తున తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఈవో తెలిపారు.

Similar News