షాహిన్‌బాగ్ నిరసనకారులతో సుప్రీంకోర్టు మధ్యవర్తులు మరోసారి సమావేశమయ్యారు. సీనియర్ న్యాయవాదులు సంజయ్ హెగ్డే, సాధన రామచంద్రన్, మాజీ సీఐసీ వజహట్ హబీబుల్లాలు షాహిన్ బాగ్ ఆందోళన వేదిక వద్దకు వెళ్లారు. ఆందోళనకారుల డిమాండ్లపై చర్చలు చేపట్టారు. ఆందోళన విరమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై నిరసనకారులతో మాట్లాడారు.. ఆందోళన వేదికను మార్చు కోవాలన్న సుప్రీంకోర్టు సూచనను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. నిరసన తెలపవద్దని తాము చెప్పడం లేదని, మిగతా ప్రజలకు కూడా ఇబ్బంది కలిగించవద్దని మాత్రమే చెబుతున్నామని మధ్యవర్తులు స్పష్టం చేశారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌లో 2 నెలలుగా ఆందోళనలు జరుగుతున్నాయి. నిరసనకారులు రహదారులను దిగ్బంధించి మరీ ఆందోళన చేస్తున్నారు. ఈ వ్యవహారం పై సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించింది. చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేయవచ్చని అంటూనే ఇతర వర్గాల ప్రజల హక్కులను కూడా గుర్తించాలని హితవు పలికింది. ఆందోళన వేదికను మార్చు కోవాలని సూచించింది. సుప్రీంకోర్టు సూచనలను ఆందోళనకారులు స్వాగతించారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సుప్రీంకోర్టు ప్రతినిధులతో చర్చల అనంతరం ఆందోళన వేదిక మార్పుపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.