తెలంగాణ బడ్జెట్‌పై కసరత్తు ముమ్మరం చేసిన మంత్రి హరీష్‌ రావు

Update: 2020-02-24 08:39 GMT

తెలంగాణ బడ్జెట్‌పై కసరత్తు ముమ్మరం చేశారు ఆర్థిక మంత్రి హరీష్‌ రావు. బీసీ సంక్షేమశాఖ బడ్జెట్ రూపకల్పనలో భాగంగా తన పేషీలోని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, ఇతర అధికారుల‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీలకు రూ.7 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించాలని మంత్రి గంగుల కోరారు. తెలంగాణ జనాభాలో 54 శాతం ఉన్న బీసీ వర్గాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయించి బీసీలకు పెద్దపీఠ వేయాలని హరీష్‌ రావును గంగుల కమలాకర్‌ కోరారు.

మరోవైపు అరణ్య భవన్‌లో గిరిజన సంక్షేమశాఖ బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి హరీష్‌ రావు సమీక్ష నిర్వహించారు. కేటాయించే ప్రతి పైసా చూసి ఖర్చు పెట్టాలని అధికారులకు సూచించారు మంత్రి. విద్యార్థులు, గిరిజనుల సంక్షేమానికి అడిగిన నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. సబ్‌ప్లాన్‌ నిధులు సరిగా ఖర్చు అయ్యేటట్లు చూడాలన్నారు. కేంద్ర నిధులతో పాటు అదనపు నిధులు వచ్చేలా యూసీలు ఇవ్వాలన్నారు. కేంద్రం నుంచి వచ్చే డబ్బు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదేనని అధికారులతో అన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ గిరిజన శాఖకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కల్యాణలక్ష్మి, పిల్లల ఆహారం, పాల బిల్లులు గ్రీన్‌ ఛానెల్‌లో పెట్టాలని విజ్ఞప్తి చేశారు. పెరిగిన అవసరాలకు అదనపు కేటాయింపులు చేయాలని మంత్రి కోరారు.

Similar News