లక్షా 50 వేల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌

Update: 2020-02-29 09:54 GMT

2020-21 ఆర్థిక సంవత్సర తెలంగాణ బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థికశాఖ, ఇతర అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అవలంభించాల్సిన ఆర్థిక విధానంపై లోతుగా చర్చించారు. బడ్జెట్లో ఏఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి? ఏ రంగాలకు ఎంత కేటాయింపులు జరపాలి? ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటి? స్వీయ ఆదాయం పెంచుకునే మార్గాలేమిటి? తదితర అంశాలపై కసరత్తు చేశారు. ఈ సమీక్షలో ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈసారి కూడా వాస్తవ బడ్జెట్‌ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బీసీ సంక్షేమ శాఖలో కేసీఆర్‌ ఆపద్బంధు, రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మంది మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ మినహా పెద్దగా కొత్త పథకాలు లేకుండా ఉన్న వాటిని కొనసాగిస్తూ, ఆదాయానికి తగ్గట్టుగా వ్యయ అంచనాలు సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షలో పలు కీలక అంశాలపై కసరత్తు చేశారు. దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం నేపథ్యంలో రాష్ట్రంలో అవలంబించాల్సిన ఆర్థిక విధానంపై లోతుగా చర్చించారు.

మార్చి మొదటి వారంలో శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో 2020-21 రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉంది. దీని రూపకల్పనకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. తుది మెరుగులు దిద్దుతోంది. ఇదే అంశంపై సమావేశంలో సీఎం పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఈసారి కూడా వాస్తవ బడ్జెట్‌నే ప్రతిపాదించాలని నిర్ణయించారు. రానున్న బడ్జెట్‌ లక్షా 50 వేల కోట్లకు అటు ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక మాంద్యం కారణంగా గత 2019-20 బడ్జెట్‌ లక్షా 46 వేల కోట్లుగా ప్రతిపాదించారు. ఈసారి కొత్త పథకాల ప్రకటన లేకుండానే బడ్జెట్‌ రూపొందించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అమల్లో ఉన్న పథకాలు సక్రమంగా కొనసాగించాలని భావిస్తున్నారు.

ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్ల వయస్సు తగ్గింపు, రైతు రుణమాఫీ వంటివి అమల్లోకి తీసుకురావాల్సి ఉంది. దీనికి అనుగుణంగా కేటాయింపులు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకే బడ్జెట్‌ రూపొందించాలని కేసీఆర్‌ సూచించినట్టు సమాచారం. కేంద్రం నుంచి రానున్న నిధులను బట్టి, బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేయనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ఆదాయం సుమారు లక్ష కోట్లకు చేరుకుంది. గత డిసెంబరు నాటికే రాష్ట్రానికి వచ్చిన ఆదాయం సుమారు 92 వేల 947 కోట్లుగా నమోదైంది. జనవరిలో వచ్చిన ఆదాయాన్ని కూడా లెక్కిస్తే లక్ష కోట్లకు చేరుకుందని అధికారుల అంచనా. వివిధ మార్గాల ద్వారా సుమారు 21 వేల కోట్ల రూపాయలను రుణాల కింద రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకుంది. అయితే వ్యయం కూడా భారీగానే ఉంది. డిసెంబరు నాటికి 86 వేల242 కోట్లు ఖర్చు చేశారు. మరో 6 వేల 794 కోట్ల రూపాయలు రుణాల చెల్లింపునకు వినియోగించారు.

డిసెంబరు నాటికి కొన్ని ముఖ్య విభాగాల నుంచి వచ్చిన ఆదాయం చూస్తే.. జీఎస్టీ ద్వారా 20 వేల 348 కోట్ల రూపాయలు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు ద్వారా 4 వేల 865 కోట్లు .. సేల్స్‌ ట్యాక్స్‌ రూపేణా 14 వేల 5 కోట్లు.. స్టేట్‌ ఎక్సైజ్‌ డ్యూటీలు ఇతరత్రాలు కలిపి 9 వేల 32 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద 8 వేల 449 కోట్లు .. ఇతర పన్నులు, డ్యూటీలు ద్వారా 3 వేల 559 కోట్లు.. రుణాలు 21 వేల 715 కోట్లుగా ఉంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. కొత్తగా ఆదాయం వచ్చే దాన్ని బట్టి కొత్త స్కీములను ప్రవేశపెట్టే యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. మొత్తానికి ఈ ఏడాదికి వాస్తవిక బడ్జెట్టే ఉంటుందని ప్రభుత్వం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

గ్రామాల్లో MBC యువకులకు ఉపాధి కల్పించేందుకు కేసీఆర్‌ ఆపద్బంధు పేరుతో పథకం ప్రారంభించాలని బీసీ సంక్షేమ శాఖ భావిస్తోంది. ఐదుగురు యువకులకు ఒకటి చొప్పున అంబులెన్స్‌లు పంపిణీ ఈ పథకం ఉద్దేశం. పైలట్‌ ప్రాజెక్టుగా జిల్లాకు ఒకటి చొప్పున ప్రారంభించాలని నిర్ణయించింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పది వేల మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా.. ఉన్న సంక్షేమ పథకాలనే పకడ్బందీగా అమలు చేయాలన్న లక్ష్యంతో బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది తెలంగాణ ప్రభుత్వం.

Similar News