'గిరిజా క్షమించు.. తల్లి అమృత అమ్మ దగ్గరికి వెళ్లిపో' : మారుతీరావు సూసైడ్‌ నోట్‌

Update: 2020-03-09 09:42 GMT

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కలకలం రేపింది. ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో గది అద్దెకు తీసుకున్న ఆయన విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలం నుంచి పాయిజన్‌ బాటిల్‌, సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మారుతీరావు రాసినట్లు భావిస్తున్న ఆ నోట్‌లో 'గిరిజా క్షమించు.. తల్లి అమృత అమ్మ దగ్గరికి వెళ్లిపో’ అని రాసి ఉంది. మారుతీరావు మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు పోస్ట్‌మార్టం పూర్తి చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇవాళ మిర్యాల గూడాలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు..

మారుతీరావు మృతికి తమ్ముడితో ఆస్తి వివాదాలే కారణం కావొచ్చనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ప్రణయ్‌ హత్యకు ముందు తన ఆస్తిని తమ్ముడి పేర రాయించిన మారుతీరావు.. ఇటీవల అతడి పేరును తొలగిస్తూ వీలునామా మార్పించారు. అయితే మారుతీరావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన సోదరుడు శ్రవణ్ తెలిపారు.

ప్రణయ్ హత్య కేసు ట్రయల్ చివరి దశకు రావడంతో మారుతీరావు టెన్షన్‌కు గురైనట్లు ఒక ప్రచారం జరుగుతోంది. ప్రణయ్ హత్య కేసులో కోర్టు విచారణ వేగవంతమైంది. ప్రణయ్‌ను కత్తితో నరికి చంపిన సీసీ ఫుటేజి ఉండటంతో పాటు కేసులో ఇతర సాక్ష్యాలు కూడా బలంగా ఉండటంతో తప్పనిసరి శిక్ష పడుతుందని మారుతీ రావు భావించారు. మరోవైపు ఆయనకు కుటుంబసభ్యుల నుంచి పెద్దగా మద్దతు లేదని తెలుస్తోంది. దీనికి తోడు నల్గొండలో అడ్వకేట్లు ఆయనకు సపోర్ట్ చేయలేదు. దీంతో లాయర్‌ను కలవడానికి శనివారం హైదరాబాద్‌ వచ్చారు. నల్గొండలో కేసు అనుకూలంగా రాకపోయినా హైకోర్ట్‌కు వెళ్దామనే ఆలోచనలో ఉన్న ఆయన సరైన న్యాయవాదులు అండగా లేకపోవడంతో తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు సన్నిహితులు చెబుతున్నారు. మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వచ్చే సమయంలో కూడా ఆయన వెంట ఓ అడ్వకేట్ ఉన్నట్లు తెలుస్తోంది. మిత్రుడికి చెందిన ఓ ఫర్టిలైజర్‌ షాపులోనే మారుతీరావు పాయిజన్‌ తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

కేసు విషయంలో కూతురు అమృత కూడా తనకు సపోర్ట్‌ చేయట్లేదనే మనోవేదనలోనే అఘాయిత్యానికి పాల్పడినట్లు అంతా భావిస్తున్నారు. తన తండ్రి ఆత్మహత్య గురించి టీవీలో చూసే తెలుసుకున్నామని తెలిపింది అతని కూతురు అమృత. ప్రణయ్‌ హత్య జరిగిన తర్వాత నుంచి తండ్రి తనతో టచ్‌లో లేడని తెలిపింది. ప్రణయ్‌ను చంపిన పశ్చాతాపంతోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అభిప్రాయపడింది. జైలు జీవితం గడపాల్సి వస్తుందనే భయంతోనే మారుతీరావు ఆత్మ హత్య చేసుకున్నారా.. లేక ఆస్తి తగాదాలే ఆత్మహత్యకు దారి తీసిందా..? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.

Similar News