తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా ప్రభావం చూపుతోంది. గాంధీ ఆస్పత్రికి మళ్లీ తాకిడి పెరుగుతోంది. కర్ణాటకలో కరోనా కారణంగా ఓ వ్యక్తి చనిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ అలర్టయ్యింది. చనిపోయిన వ్యక్తి అంతకుముందు హైదరాబాద్ కు కూడా వచ్చినట్లు తెలియటంతో తెలంగాణ ప్రభత్వం అలర్ట్ అయ్యింది.
మరోవైపు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా వైరస్ సోకిన వ్యక్తిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. మహేంద్రహిల్స్‌కు చెందిన వ్యక్తికి తాజాగా నిర్వహించిన పరీక్షలో కరోనా నెగెటివ్ రావడంతో పాటు పూర్తిగా కోలుకోవడంతో ఇంటికి పంపించారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తిని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి పంపించడం హర్షణీయమని మంత్రి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఒక్క వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ లేదని మంత్రి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలె కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నెల 6న ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్టు వైద్య, ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. దీంతో జిల్లాలో హై అలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు కృష్ణపట్నం పోర్టు, శ్రీహరికోట రాకెట్ కేంద్రాలను అప్రమత్తం చేసింది. పాఠశాలలకు 18 వరకు సెలవులు ప్రకటించారు. మరోవైపు సూళ్లూరుపేటలో ముగ్గురు కరోనా అనుమానితులను గుర్తించగా వెంటనే వారిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కడప జిల్లాలో కరోనా అనుమానిత లక్షణాలతో ఇద్దరు రిమ్స్ లో చేరారు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారిద్దరికీ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తితిదే చర్యలు చేపట్టంది. అలిపిరి టోల్ గ్రేట్ వారిమెట్టు, అలిపిరి కాలినడక ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో అప్రమత్తమైన తెలుగు రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. క్యూలైన్లో వచ్చే భక్తులకు శానిటైజన్ల ను అందజేస్తున్నారు. భక్తులు చేతులను శుభ్రం చేసుకున్న తర్వాతే ఆలయంలోకి అనుమతిస్తున్నారు.