బయటపడుతున్న పోలీసుల అరాచకాలు.. పోలీస్ స్టేషన్లలోనే పంచాయితీలు

Update: 2020-03-16 17:39 GMT

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ, వారికి మద్దతుగా పోలీసులు సాగించిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చిత్తూరు జిల్లా రేణిగుంట జనసేన ZPTC అభ్యర్థిగా ఎస్.షాహిద నామినేషన్ వేశారు. విత్ డ్రా చేసుకోవాలంటూ.. పోలీసులు స్టేషన్ కు పిలిపించి బెదరించారు. చివరికి నామినేషన్ విత్‌డ్రా చేయించారు. ఇదెక్కడి అన్యాయమని జనసేన నేతలు వినూత, చంద్రబాబు పోలీసుల్ని ప్రశ్నించారు. ఇదే క్రమంలో ఈ ఇద్దరిపైనా దాడి చేశారు వైసీపీ నేతలు. ఈ వ్యవహారమంతా మీడియాలో వచ్చింది. విషయం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్లింది. దీంతో.. మంగళవారం పవన్ తిరుపతి పర్యటనకు వస్తున్నారు. పోలీసులు, వైసీపీ దౌర్జన్యంతో నామినేషన్ విత్‌ డ్రా చేసుకున్న బాధితుల్ని కలిసే అవకాశం ఉండటంతో.. ఇప్పుడు కొత్త డ్రామాకు తెరలేపారు పోలీసులు.

తమ బెదిరింపులతో నామినేషన్ విత్‌డ్రా చేసుకున్న బాధితుల్ని మళ్లీ స్టేషన్‌కు పిలిపించారు. వారితో జనసేన నేతలపైనే రివర్స్ కంప్లైంట్ రాయించారు. అసలు ఎన్నికల్లో పోటీ చేయడమే తమకు ఇష్టం లేదని.. అయినప్పటికీ జనసేన నేతలు వినూత, చంద్రబాబే తమతో బలవంతంగా నామినేషన్లు వేయించారని ఆ ఫిర్యాదులో బలవంతంగా రాయించారు. నామినేషన్‌ ఉపసంహరణలో తమపై ఎవరి ఒత్తిడీ లేదని అందులో పేర్కొన్నారు. ఇలా బలవంతంగా రాయించిన ఫిర్యాదుపై సంతకాలు పెట్టాలంటూ బాధితులపై ఒత్తిడి తెస్తున్నారు పోలీసులు. అయితే వాళ్లు సంతకాలు చేసేందుకు ససేమిరా అంటున్నారు.

Similar News