కరోనా వైరస్ అంతకంతకూ వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసునే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రాన్ని ఫీవర్ సర్వైవలెన్స్ స్టేట్ గా ప్రకటించే అవకాశం వుంది. జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరినీ పరీక్షించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇక, తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇవాళ కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36కు చేరింది.
ఇదిలావుంటే, సీఎం కేసీఆర్ నేతృత్వంలో అత్యున్నత, అత్యవసర సమావేశం ప్రారంభమైంది. వైద్య ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ, పౌర సరఫరాలు, వ్యవసాయం, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ పరిస్థితులపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం వున్నట్టు సమాచారం. సమావేశం ముగిసిన వెంటనే కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సీఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.