తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మరి తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో సర్కార్ లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో రాష్ట్రమంతా ఎక్కడికక్కడ నిర్మాణుష్యంగా మారిపోయింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఎంతో మంది పేద ప్రజల ఆకలి తీర్చే అన్నపూర్ణ కేంద్రాలు కూడా మూత పడ్డాయి. దీంతో చాలా మంది పేదలు, వృద్దులు ఆకలికి అలమటించి పోతున్నారు. ఈ నేపథ్యంలో అన్నార్తుల ఆకలి తీర్చేందుకు జీహెచ్‌ఎంసీ ఉదార నిర్ణయం తీసుకుంది. అన్నపూర్ణ కేంద్రాల వద్ద గురువారం ఉచితంగా భోజనం అందించే ప్రక్రియను ప్రారంభించింది. సాధారణంగా రూ.5కు అందిచే భోజనాన్ని లాక్‌డౌన్ దృష్ట్యా ఉచితంగా అందజేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు నిర్వహణ ఇబ్బందులున్నాయంటూ హాస్టళ్లు ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి చేసిన నేపథ్యంలో బుధవారం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్.. హాస్టళ్లలో ఉండే వారికీ జీహెచ్‌ఎంసీ నుంచి ఉచితంగా భోజనం అందజేయాలని సూచించారు.