కరోనా మహామ్మరి నియంత్రణ చర్యలపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గాంధీ హాస్పటల్‌ను పూర్తిగా కరోనా బాధితుల చికిత్స కోసమే వినియోగించేలా తయారుచేయాలని ఈ సందర్భంగా ఈటెల సూచించారు. కొవిడ్- 19 రాష్ట్రంలో రెండోదశలో ఉన్నందున.. మూడో దశకు చేరుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చేరుకుంటే ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై అధికారులతో సమీక్షలో చర్చించారు. కరోనా విస్తరించే పరిస్థితి రాకుండా వైద్యవిభాగాలు అప్రమత్తం కావాలని, అందరికీ సెలవులు రద్దుచేయాలని ఆదేశించారు.
ఇప్పటికే గాంధీలో చేయాల్సిన ఆపరేషన్లను ఉస్మానియాలో నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ నెలాఖరు వరకు మిగతా అన్ని విభాగాలను కూడా తరలించి, గాంధీ హాస్పటల్ ను కరోనా వైద్యసేవలకు పూర్తిస్థాయిలో వినియోగించేలా ఏర్పాట్లుచేయాలని తెలిపారు. కరోనా బాధితుల సంఖ్య పెరిగితే అవసరమయ్యే పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లను, మాస్క్‌లు, ముఖ్యమైన వస్తువులను సాధ్యమైనన్ని ఎక్కువ కొని పెట్టుకోవాలని సూచించారు. ఐఏఎస్ అధికారి నేతృత్వంలో పనిచేస్తున్న కమిటీ ద్వారా తక్కువ ధరకు నాణ్యమైన పరికరాలు కొనాలని, ఐసీయూ పరికరాలు, వెంటిలేటర్లు సమకూర్చుకోవాలని ఆదేశించారు. కరోనా మూడో దశలోకి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నామని ఈటెల వెల్లడించారు.