మా కోసం మేము.. మా ఆరోగ్యం కోసం మేము ఇంట్లో భద్రంగా ఉన్నాం. కానీ మీరు మాత్రం మీ ప్రాణాలను ఫణంగా పెట్టి వైరస్‌తో యుద్ధం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాపడడానికి నడుం బిగించారు. నిజమైన దేశభక్తి అంటే మీదే. మీ సేవలు అమోఘం.. మీ స్ఫూర్తి అభినందనీయం.. మరి కొందరికి ఆచరణాత్మకం అని దేశ రక్షణకు పాటుపడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులను ఉద్ధేశించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆత్మవిశ్వాసంతో దేశ ప్రజలందరూ ఒకే తాటిపై నిలుస్తూ వైరస్‌ను తరిమి కొట్టాలని ఆమె అన్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు రావొద్దని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అన్నారు. ప్రభుత్వ అధికారులంతా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే నిమిత్తం నిరంతరం పనిచేస్తున్నారని సోనియా అన్నారు. వీరందరికి మన సహాయ సహకారాలు ఉంటేనే వైరస్ నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు. కరోనా మహమ్మారిని ఓడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు తమ బాధ్యతను నిర్వర్తించాలని సోనియా పిలుపునిచ్చారు. ఈ సంకట పరిస్థితి నుంచి దేశం త్వరగా కోలుకుంటుందని ఆశిస్తున్నానని ఆమె అన్నారు.