ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఎదుట తీవ్ర ఉద్రిక్తత

Update: 2020-05-09 16:28 GMT

విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్యాస్ ఘటన బాధితుల ఆవేశం కట్టలు తెంచుకుంది. కంపెనీలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు వచ్చిన డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను బాధితులు అడ్డుకున్నారు. కంపెనీలోకి వెళ్లకుండా అడ్డుపడ్డారు. తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. ఓ మహిళ డీజీపీ కాళ్లపై పడి బతిమాలే ప్రయత్నం చేసింది.

వందలాదిగా తరలివచ్చిన బాధిత కుటుంబాలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశాయి. బాధితుల మృతదేహాలతో నిరసన తెలిపారు. కంపెనీతో కుమ్మక్కై తమ ప్రాణాలతో ఆటలాడుకుంటారా అంటూ.. బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీని వెంటనే అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. కంపెనీని తరలించేవరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.

డీజీపీ గౌతం సవాంగ్‌ను కంపెనీలోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు బాధితులు. డీజీపీ లోపలికి వెళ్లడంతో మహిళలు గేట్లెక్కి కంపెనీలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని.. బాధిత గ్రామస్థులు తెగేసి చెప్పారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులను మోహరించారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

Similar News