ఏపీ రాజధాని తరలింపునకు తాత్కాలికంగా బ్రేక్

Update: 2020-05-12 09:16 GMT

రాజధాని విషయంలో హైడ్రామాకి ప్రభుత్వం తెరదించింది. చట్టసభల్లో అడ్డంకులన్నీ తొలిగేవరకూ పాలనా రాజధాని మార్పుపై ఎలాంటి ముందడుగు వేయబోమని స్పష్టం చేసింది. ఇదే అంశంపై హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. ఇది తాత్కాలికంగా తమకు ఊరట కలిగించే అంశమే అయినా.. అమరావతే ఆంధ్రుల రాజధానిగా ఉండేలా చూసేందుకు తుదివరకూ పోరాడతామంటున్నారు JAC నేతలు, రైతులు.

గతేడాది డిసెంబర్ 17 నుంచి ఏపీ రాజధాని అంశం రగులుతూనే ఉంది. 3 రాజధానులు ఉండొచ్చంటూ అసెంబ్లీలో సీఎం జగన్‌ ప్రకటనతో అమరావతిలో మొదలైన ఉద్యమం 150 రోజులకు చేరువైంది. కరోనా వల్ల 29 గ్రామాల్లో నిరసనలు తాత్కాలికంగా ఆగినా.. YCP సర్కార్ రాజేసిన అగ్గి మాత్రం చల్లారలేదు. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత సమయంలో సైతం ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖకు తరలించేందుకు ప్రయత్నాలు చేయడం రైతుల్లో మరింత ఆందోళనకు కారణమయ్యాయి. దీంతో.. పాలనా రాజధాని తరలింపు ప్రక్రియ ఆపేలా చూడాలంటూ అమరావతి పరిరక్షణ JAC కార్యదర్శి గద్దె తిరుపతిరావు ఏప్రిల్ 24న హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు అఫిడవిట్ దాఖలు చేయాలని అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది. ఇందుకు 10 రోజుల గడువు ఇచ్చింది. ఆ తర్వాత కూడా దీనిపై వాయిదా కోరిన AG.. తాము ఎలాంటి తరలింపు చేపట్టబోవడం లేదని మౌఖికంగా చెప్పినా.. చివరికి ప్రమాణపత్రం దాఖలు చేశారు. చట్టసభల్లో అడ్డంకులు తొలిగే వరకూ రాజధాని విషయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోమని పేర్కొన్నారు.

Similar News