సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్.. చర్చకు వచ్చిన కీలక అంశాలు

Update: 2020-05-12 08:30 GMT

రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ సుదీర్ఘంగా సాగింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఈ నెల 17న ముగియనుండటంతో లాక్‌డౌన్‌పై భవిష్యత్‌ కార్యాచరణ... ఎగ్జిట్ ప్లాన్ ఎలా ఉండాలి... ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలో పెట్టాలి... రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది.. కరోనా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు వంటి అంశాలపై ప్రధాని మోదీ ప్రధానంగా చర్చించారు. కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రులతో 5వ సారి సాగిన సమావేశంలో అనేక కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకు సాగాల్సిన తీరు, ఎదుర్కొంటున్న సవాళ్లకు సంబంధించిన వ్యూహంపై చర్చించారు.

కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామాన్‌, హర్ష వర్ధన్, అమిత్‌ షాతోపాటు ఇతర కేంద్ర మంత్రులు... ఈ వీడియో కాన్ఫరెన్స్‌ భేటీలో పాల్గొన్నారు. కరోనా నివారణలో రాష్ట్రాలు చేస్తున్న కృషిని మోదీ కొనియాడారు. కరోనా నివారణలో రాష్ట్రాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాయన్నారు. అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో కేబినెట్‌ సెక్రటరీ టచ్‌లో ఉన్నారని.. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు మోదీ. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో.. దేశ ప్రజల పోరాటాన్ని అభినందిచారు. సీఎంలు.. అందించే సూచనల ఆధారంగానే.. దేశంలో ఏ దిశలో వెళ్లాలో తాము నిర్ణయించగలగుతామన్నారు మోదీ.

లాక్‌డౌన్‌ వల్ల ఎక్కడివారు అక్కడే ఉండిపోయారన్నారు. అయితే... సమస్యలు వచ్చినపుడు.. ఇంటికి వెళ్లాలనిపించడం మానన నైజమన్నారు మోదీ. వలస కార్మికులు సొంత ఊళ్లకు వెళుతున్న పరిస్థితుల్లో... కరోనా మహమ్మారి వ్యాపించకుండా ప్రయత్నించాలన్నారు. వలస కార్మికులు సురక్షితంగా ఇంటికి చేరేలా రాష్ట్ర ప్రభుత్వాలను మోదీ కోరారు. కరోనా మహమ్మారి నుంచి భారత్‌ తనను తాను విజయవంతంగా రక్షించుకుందని యావత్ ప్రపంచం భావిస్తోందన్న ప్రధాని... ఈ అంశంలో రాష్ట్రాలే కీలక పాత్ర పోషించాయన్నారు. ఎక్కడైతే భౌతిక దూరం పాటించలేదో.. అక్కడ సమస్యలు పెరిగాయన్నారు. లాక్‌డౌన్‌ నుంచి గ్రామీణ ప్రాంతాలకు మినహాయింపులు ఇచ్చినా... కరోనా అక్కడ వ్యాపించకుండా చూడటం మన ముందున్న అతి పెద్ద సవాల్‌ అన్నారు.

కరోనా కేసులు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో... లాక్‌డౌన్‌ను మరింత పొడిగించాలని పలు రాష్ట్రాలు ప్రధానిని కోరాయి. ప్రయాణికుల రైళ్లను అప్పుడే పునరుద్ధరించవద్దని.. రైల్వే ప్రయాణీకులందరినీ క్వారంటైన్ చేయలేమన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. దేశంలోని ప్రధాన నగరాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉంది.. ఇప్పుడే కరోనా మనల్ని వదిలి పోయేలా లేదన్నారు కేసీఆర్‌. దాంతో కలిసి బతకడం తప్పదన్నారు. హైదరాబాద్‌ నుంచే కరోనా వ్యాక్సిన్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు. పరికరాలు, మందులు, మాస్కులు, పీపీఇ కిట్లు, బెడ్లు కావాల్సినన్నీ ఉన్నాయన్నారు కేసీఆర్‌.

లాక్‌డౌన్ సడలింపులు... కంటైన్మెంట్‌ వ్యూహాలపై పూర్తిగా పునారాలోచించాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ సీఎం జగన్. కంటైన్మెంట్‌ కారణంగా ఆర్థిక లావాదేవీలకు ఇబ్బంది నెలకొందన్నారు. దీనిలో మార్పులు చేయాలన్నారు. కాన్ఫరెన్స్ MSMEలను ఆదుకోకపోతే నిరుద్యోగం పెరుగుతందన్నారు. కరోనా పట్ల ప్రజల్లో భయాన్ని తొలగించాలని జగన్ అభిప్రాయపడ్డారు.

Similar News