డాక్టర్ సుధాకర్ మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలం ఏంటీ? కేసు సీబీఐకి ఎందుకు బదిలీ అయింది?
డాక్టర్ సుధాకర్ కేసు సీబీఐకి చేరింది. మెజిస్ట్రేట్ నమోదు చేసిన వాంగ్మూలం హైకోర్టుకు చేరిన తర్వాత కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ అఫిడవిట్‌కు మెజిస్ట్రేట్ నమోదు చేసిన వాంగ్మూలానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయనే కారణంతోనే కేసును సీబీఐకి అప్పగించింది హైకోర్టు. ఇంతకీ డాక్టర్ సుధాకర్ మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలం ఏంటి? ఆస్పత్రిలో సుధాకర్ పరిస్థితిని పరిశీలించిన తర్వాత మెజిస్ట్రేట్ నమోదు చేసిన వివరాలేంటి? అనేది ఆసక్తిగా మారింది. అధికారులు డాక్టర్ సుధాకర్ వాదనను బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నా.. హైకోర్టు ప్రమేయంతో ఆయనకు తన వాదన వినిపంచుకునే అవకాశం కలిగింది. దీంతో ఈ నెల 16న ఏం జరిగిందో జడ్జికి వివరించారాయన.
ఎన్ 95 మాస్కులు అడిగితే.. ఫార్మాసిస్టు ఒకటి ఇచ్చి దాన్ని 15 రోజులు వాడుకోవాలని సూచించినట్టు డాక్టర్ సుధాకర్ జడ్జికి ఇచ్చిన వాంగ్మూలంలో వివరించారు. మాస్కులు లేకుంటే ఆపరేషన్ థియేటర్లలో ఏర్పడే ఇబ్బందులను వీడియో తీసి.. దాన్ని చూపించేందుకే ఆసుపత్రి కమిటి చైర్మన్, ఎమ్మెల్యే గణేశ్ ఇంటికెళ్లినట్లు తెలిపారు. వాళ్లు అక్కడ లేకపోవటంతో మున్సిపల్ ఆఫీసుకు వెళ్లానని, అక్కడ ఎమ్మెల్యే, అదనపు ఎస్పీ, సీఐ అందరూ ఎన్95 మాస్కులు ధరించి ఉన్నారన్నారు. ఆపరేషన్ థియేటర్ సిబ్బందికి ఎన్95 మాస్కులు అడిగినందుకు దుర్భషలాడారాని, గుర్తు తెలియని వ్యక్తులు కూడా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బెదిరించారని జడ్జికి తెలిపారు. ఆ తర్వాత ఏప్రిల్ 8న ఉదయం అంబులెన్స్ డ్రైవర్ తనకు సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చి వెళ్లినట్లు తన వాంగ్మూలంలో వివరించారు సుధాకర్.
ఎన్ 95 మాస్కులు అడిగినప్పటి నుంచే తనకు వేధింపులు ప్రారంభం అయ్యాయన్నారు డాక్టర్ సుధాకర్. దాదాపు 13 రోజుల కిందట ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తన కుమారుడి బైక్ సీజ్ చేశారని అన్నారు. మూడు రోజుల తర్వాత 4వ పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తనను ఓ మహిళా కానిస్టేబుల్ చేయి పట్టుకుందని అన్నారు. వదలి పెట్టాలని ఆ మహిళా కానిస్టేబుల్ ఏడ్చిందని.. మిగిలిన పోలీసులు తప్పుడు కేసు పెట్టి ఉద్యోగం ఊడగొట్టిస్తామంటూ బెదరించారని జడ్జికి వివరించారు. ఈ నెల 16న అనకాపల్లికి వెళ్లి వస్తుండగా ట్రాఫిక్ పోలీసులు తనను రెచ్చగొట్టేలా వ్యవహరించారని అన్నారు. కారులో మద్యం బాటిళ్లు పెట్టి తాగినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించారని జడ్జికి వాంగ్మూలం ఇచ్చారు.