తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున దుబ్బాకకు సాగునీరు విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు ఆర్థిక మంత్రి హరీష్‌రావు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం మల్లన్నసాగర్ నుంచి దుబ్బాక నియోజకవర్గానికి కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు మంత్రి హరీష్‌రావు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లింగారెడ్డి పాల్గొన్నారు. వలసలకు, ఆత్మహత్యలకు నిలయంగా వున్న దుబ్బాక ప్రాంతానికి ముఖ్యమంత్రి ఆశీస్సులతో సాగునీరు, తాగునీరు అందడం గర్వంగా ఉందన్నారు హరీష్‌రావు. తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఫలితంగా దుబ్బాకకు సాగునీరు అందుతోందన్నారు. గోదావరి నీటితో చెరువులు నింపి అలుగులు పారిస్తుంటే కాంగ్రెస్ నాయకులకు కళ్లు కనపడటం లేదా అని ప్రశ్నించారు. గాంధీ భవన్‌లో కూర్చుని మాట్లడం కాదని, ఇక్కడకు వచ్చి చూస్తే వాస్తవమేంటో తెలుస్తుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు నీరు రాలేదని ఉత్తమ్ మాట్లాటం సిగ్గు చేటన్నారు హరీష్‌రావు. కాంగ్రెస్ నాయకులు రైతుల దగ్గరకు వెళ్లి నిజాలు తెలుసుకోవాలని హరీష్‌రావు హితవు పలికారు.