కర్నూలు జిల్లాలో ఓ ప్రేమజంట వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలు బలికొంది. తమ్ముడి ప్రేమను కాపాడే ప్రయత్నంలో అన్నయ్య ప్రాణాలు కోల్పోయాడు. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం పేరూరులో జరిగిందీ విషాద ఘటన.
తమ్ముడి ప్రేమకు మధ్యవర్తిగా ఉన్నాడంటూ ప్రవీణ్‌పై రెండ్రోజుల క్రితం అమ్మాయి బంధువులు దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టారు. వీరి నుంచి తప్పించుకునే క్రమంలో బైక్‌పై పారిపోతూ ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలపాలైన ప్రవీణ్‌ను వెంటనే కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను ప్రాణాలు కోల్పోయాడు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాధ్యుల్ని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామంటున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. పేరూరుకు చెందిన అమ్మాయి, అబ్బాయి మే 31న ఊరు విడిచి వెళ్లిపోయారు. వీరికి ప్రవీణ్ సహకరించాడని అమ్మాయి కుటుంబసభ్యులు కక్ష పెంచుకున్నారు. ఆగ్రహంతో అతనిపై దాడి చేయడం వల్లే ఇలా జరిగిందని ప్రవీణ్ కుటుంబం ఆవేదన చెందుతోంది.