మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేసే అలవాటు రైతాంగంలో రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దీనికోసం వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు. ఈసారి ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తోంది. ఇది ప్రతీ ఏటా ప్రతీ సీజన్‌లో కొనసాగాలని సీఎం ఆకాంక్షించారు. నియంత్రిత పద్ధతిలో పంటల సాగు వ్యూహాన్ని ఖరారు చేయడం కోసం సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖ అధికారులు, నిపుణులతో మూడు రోజులపాటు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వారికి పలు సూచనలు చేశారు.
మార్కెట్లో అమ్ముడుపోయే పంటను మాత్రమే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు సీఎం కేసీఆర్. అంతేకాదు రైతుల పంటకు ధర రాని దుస్థితి ఉండదని ఆయన చెప్పారు. రైతు లాభం కోసం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని అందరూ విజయవంతం చేయాలని సీఎం కోరారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం కేసీఆర్ బహుముఖ వ్యూహాలను అనుసరిస్తున్నారు. ఒకవైపు డిమాండ్ ఉన్న పంటలను పండించాలని సూచిస్తున్నారు. మరోవైపు ప్రజల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని పండించాలంటున్నారు. ఇంకోవైపు దేశంలోని ఏ ప్రాంతంలో ఎలాంటి పంటలు అవసరమో గుర్తించాలని అధికారులను పురమాయిస్తున్నారు. దీనివల్ల తెలంగాణలో పండించిన పంటలను డిమాండ్ ఉన్న ప్రాంతానికి తరలించి అమ్మే వీలుంటుంది. ఇలా చేయడం వల్ల మద్దతు ధరలు లేవనే మాటే ఉండదు. దళారులపై ఆధారపడి మోసపోయే దుస్థితి ఉండదు. ఫలితంగా రైతుకు వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. ఇవే విషయాలపై కేసీఆర్ అధికారులతో మూడురోజులపాటు సుదీర్ఘంగా చర్చించారు.
దేశంలో, రాష్ట్రంలో ఆహార భద్రత సాధించగలిగినప్పటికీ, పోషకాహార భద్రత సాధించలేదని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజలు బలవర్థకమైన ఆహారం తినేలా ప్రోత్సహించాలని సీఎం సూచించారు. అలాంటి పంటలు పండించాలని ఆయన చెప్పారు. దీనివల్ల ప్రజల రోగ నిరోధక శక్తితోపాటు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు.
ఎరువులు, పురుగు మందుల వాడకంలో రైతులు శాస్త్రీయత పాటించేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. మేలు రకమైన విత్తనాలు వేయాలి. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాలన్నారు కేసీఆర్. ఈ విషయాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడానికి ప్రభుత్వం అగ్రికల్చర్ రీసెర్చ్ కమిటీని నియమిస్తుందని చెప్పారు. ఇక తెలంగాణలో పత్తి పంట ఎక్కువగా పండిస్తారు. అందుకే రైతులకు సహకరించడానికి ప్రభుత్వం కాటన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తుందని సీఎం చెప్పారు.
ప్రజలకు అవసరమైన పండ్లు, కూరగాయలను తెలంగాణలోనే సాగు చేయాలని కేసీఆర్ సూచించారు. ఆలుగడ్డలు, అల్లం, ఎల్లిపాయలను దిగుమతి చేసుకోవల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే పండించాలన్నారు. ఇక మారిన పరిస్థితులకు అనుగుణంగా హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్‌ను మార్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.