ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 70 లక్షకు చేరువయ్యాయి. ఇప్పటికి 4 లక్షల మంది చనిపోయారు. మన దేశానికి వస్తే గత 2 వారాలుగా కేసుల ఉధృతి చాలా పెరిగింది. మొత్తం 2 లక్షల 47 వేల కేసులు నమోదైతే ఇవాళ రికార్డు స్థాయిలో 9 వేల 971 పాజిటివ్ కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. అక్కడ నమోదవుతున్న కేసుల సంఖ్య చైనా కంటే ఎక్కువగా ఉంది. తాజా లెక్కల ప్రకారం చూస్తే ప్రపంచంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ 6న స్థానంలో ఉంది. అమెరికా, బ్రెజిల్, రష్యా, స్పెయిన్, UK తర్వాత మన దగ్గరే కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. భారత్‌లో రికవరీ రేటు 48.2 శాతంగా ఉండడంతో మిగతా దేశాలతో పోలిస్తే మరణాల సంఖ్య కాస్త తక్కువగానే ఉంది.
భారత్‌లో కేసుల తీవ్రత రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుందనే అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఇది సమూహిక వ్యాప్తి దశకు చేరిందని WHO హెచ్చరిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది చెప్తోంది. బారత్‌లో అధిక జనాభా వల్లే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని WHO అంటోంది. అటు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనా పరీక్షల విషయంలో చైనాతోపాటు, భారత్‌పైనా కొన్ని ఆరోపణలు చేశారు. పూర్తి స్థాయిలో టెస్ట్‌లు చేయడం లేదని ఆయన అంటున్నారు. అమెరికాలో ఇప్పటికి 2 కోట్ల మందికి పరీక్షలు చేస్తే.. 20 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1 లక్ష 12 వేల మంది మృత్యువాత పడ్డారు. న్యూయార్క్‌లో 4 లక్షల కేసులుంటే 30 వేల మంది చనిపోయారు. అమెరికా తర్వాత బ్రెజిల్, రష్యాల్లో కరోనా మరణమృదంగం మోగిస్తోంది.