గ్రేటర్ హైదరాబాద్ ను ఆరు జిల్లాలుగా విభజిస్తే పార్టీని పటిష్టం చేయడానికి వీలవుతుందని రాష్ట్ర బీజేపీ అభిప్రాయపడుతోంది. ఎక్కువ మందికి నాయకత్వాన్ని అందించడానికి వీలుగా చిన్న చిన్న జిల్లాలు ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డివిజన్ లను 6 జిల్లాలుగా ఏర్పాటు చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలను సంస్థాగతంగా నాలుగు జిల్లాలుగా విభజించనున్నారు. సనత్ నగర్, ముషీరాబాద్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా.. అంబర్ పేట, ఖైరతాబాద్, నాంపల్లి, జుబ్లీహిల్స్ తో ఒకటి, గోషామహల్, కార్వాన్, చార్మినార్ తో మరొకటి, చాంద్రాయణగుట్ట, యాకుత్ పుర, మలక్ పేట, బహదుర్ పుర నియోజక వర్గాలతో మరొక జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోని డివిజన్లతో ఒక జిల్లా, మేడ్చల్ డివిజన్లతో మరొక జిల్లా సంస్థాగతంగా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి గ్రేటర్ పరిధిలోని కొత్త జిల్లాలపై ప్రకటన చేసినట్లు సమాచారం.