విశాఖ నగరవాసులకు సేవలందించే పెద్దాసుపత్రి కేజీహెచ్ లో వైద్య సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇన్ పేషెంట్ గా ఉన్న ఒక రోగికి కరోనా సోకడంతో నలుగురు పీజీ డాక్టర్లు, ఒక నర్సుకి వైరస్ సోకింది. కొద్ది రోజుల క్రితం డిశ్చార్జి అయిన కార్డియాలజీ పేషెంట్ కి కూడా వైరస్ అని తెలిసి ఆస్పత్రి సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. దీంతో వారికి చికిత్స అందించిన వైద్యులు, సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు. క్యాన్సర్ కిచికిత్స తీసుకున్న వ్యక్తికి ఈనెల 8న పాజిటివ్ అని తేలింది. దాంతో అతడికి వైద్యం అందించిన నలుగురు పీజీ విద్యార్ధులకు పాజిటివ్ వచ్చింది.
గత పది రోజుల్లో ఏడుగురు వైద్య విద్యార్ధులు, నలుగురు పేషెంట్లు, ఒక స్టాఫ్ నర్సు, ఒక ఆయా వైరస్ బారినపడ్డారు. ఇప్పటి వరకు కేజీహెచ్ నుంచి వైద్య సిబ్బందితో సహా మొత్తం 130 మందిని క్వారంటైన్ కు తరలించారు. కాగా, సగానికపైగా వైద్య సిబ్బంది క్వారంటైన్ లో ఉండడంతో వైద్యుల కొరత ఏర్పడింది. అత్యవసర కేసులు మినహా సాధారణ రోగులను స్థానిక ఆస్పత్రులకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.