కరోనా భయాన్ని మందుల కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. ప్రజల్లో పేరుకుపోయిన ఆందోళననే తమ పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. కరోనా నివారణకు ఇప్పుడప్పుడే వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో అదును చూసి కరోనా మందుల పేరుతో దందా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి సంస్థ వివాదంలో చిక్కుకుంది. కరోనా నివారణకు ఉపయోగపడే మందు కనిపెట్టామంటూ పతంజలి చేసిన ప్రకటన వివాదానికి దారి తీసింది. పతంజలి తయారు చేసిన కరోనా మెడిసిన్‌కు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ చెక్ పెట్టింది. అసలా మెడిసిన్ ఎలా తయారు చేశారు..? ఎవరి మీద ప్రయోగించారు..? పరిశోధనల వివరాలేంటీ..? తదితర ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయుష్ శాఖ ఆదేశించింది. అప్పటి వరకు మందును అమ్మడం గానీ, ప్రచారం చేయడం గానీ చేయవద్దని ఆర్డర్స్ పాస్ చేసింది.
పతంజలి సంస్థ రకరకాల ఉత్పత్తులను అమ్ముతుంది. ఇందులో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. తాజాగా కరోనా నివారణకు కరోనిల్ పేరుతో మెడిసిన్ రూపొందించినట్లు పతంజలి కంపెనీ ప్రకటించింది. కొందరు నిపుణులను నియమించుకొని రీసెర్చ్ చేశామని, 280 మందిపై మెడిసిన్‌ను ప్రయోగించిన తర్వాతే నిర్దారణకు వచ్చామని పతంజలి పేర్కొంది. ఈ మెడిసిన్‌కు 10 రోజుల కోర్సు సరిపోతుందని, నాలుగు రోజుల్లోనే 69 శాతం మందికి వ్యాధి తగ్గిందని కూడా చెప్పుకొచ్చింది. అశ్వగంధ, తిప్పతీగ సహా 150 ఔషధ మొక్కలతో ఈ మందును తయారు చేశామని తెలిపింది. కరోనిల్ కిట్ ధరను 545 రూపాయలుగా నిర్ణయించిన పతంజలి కరోనిల్ మాత్రలు వాడితే 2 వారాల్లోనే వ్యాధి నయమవుతుందని ప్రకటించింది.
పతంజలి వివరణతో కేంద్రం సంతృప్తి చెందలేదు. పతంజలి కరోనిల్ టాబ్లెట్లపై ఆయుష్ శాఖ మండిపడింది. ఎలాంటి పర్మిషన్ లేకుండా కరోనాను నివారించే మెడిసిన్ అంటూ ఎలా ప్రచారం చేసుకుంటారని ప్రశ్నించింది. ఈ మందుకు సంబంధించి ఎక్కడ పరిశోధన చేశారు..? వేటితో తయారు చేశారు? శాంపుల్ పరిమాణం సహా అన్ని వివరాలు వెల్లడించాలని పతంజలి సంస్థకు అల్టిమేటం జారీ చేసింది. ఈ మందుకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు జారీ చేయవద్దని పతంజలి సంస్థను ఆదేశించింది. ఈ ఆదేశాలపై పతంజలి కంపెనీ స్పందించింది. 5 రోజుల్లో తమ ప్రయోగాల డేటాను రిలీజ్ చేస్తామని చెప్పింది. ఐతే, కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఈ మెడిసిన్ పని చేయదని కూడా పతంజలి వివరణ ఇచ్చింది.
పతంజలి కంపెనీపై ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ చాలా సార్లు పతంజలి కంపెనీ విమర్శ లకు గురైంది. ఆయుర్వేద మందుల పేరుతో పతంజలి కంపెనీ మెడికల్ దందా చేస్తోందనే వాదనలున్నాయి. గతంలో మగ సంతానం కలగడానికి ప్రత్యేక మెడిసిన్ అంటూ పతంజలి కంపెనీ ఊదరగొట్టింది. ఐతే, ఆ మందుతో పెద్దగా ప్రయోజనం లేదని ఆ తర్వాత బయటపడింది.
నూడుల్స్ విషయంలోనూ పతంజలి కంపెనీ వివాదంలో చిక్కుకుంది. ఆ కంపెనీ ఆటా పేరుతో నూడుల్స్ విడుదల చేసింది. ఐతే, ఆటా నూడుల్స్‌కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి తీసుకోలేదు. పైగా, అనుమతి కోసం కనీసం దరఖాస్తు కూడా చేయలేదు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, పతంజలి నూడుల్స్‌పై సీరియస్ గా స్పందించింది. తమ అనుమతి లేకుండా నూడుల్స్ ఎలా అమ్ముతారని ప్రశ్నిం చింది. ఈ వివాదంపై కూడా పతంజలి కంపెనీ సరిగా వివరణ ఇవ్వలేదు.