బాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు రజత్ ముఖర్జీ ఆదివారం మరణించారు. కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం జైపూర్‌లో తుది శ్వాస విడిచారు. ఆయన మరణించారన్న విషయాన్నీ కుటుంబసభ్యులు తెలియజేశారు. బాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ చిత్రమైన 'రోడ్' అలాగే ప్యార్ తునే క్యా కియా, లవ్ ఇన్ నేపాల్, ఇష్క్ కిల్స్ సినిమాలకు దర్శకత్వం వహించారు. రజత్ ముఖర్జీ ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని నటుడు మనోజ్ భాజ్‌పాయ్ ట్వీట్ చేశారు.
మూత్రపిండాల ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన మరణించారని కుటుంబసభ్యులు తెలిపారు. లాక్డౌన్ ప్రకటించిన తరువాత జైపూర్ లోని తన స్వగ్రామంలో ఉంటున్నారు. అప్పటినుంచి మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. రెండు నెలల కిందట ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం మే నెలలో డిశ్చార్జ్ అయ్యారు. అప్పటినుంచి డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే రజత్ ముఖర్జీ ఆదివారం ఉదయం మరణించారని తెలిపారు. బాలీవుడ్ ప్రముఖులు రజత్ ముఖర్జీ మృతిపట్ల నివాళులు అర్పించారు.