'సంజీవిని' సంచార ల్యాబ్.. పావుగంటలో రిజల్ట్

Update: 2020-07-19 16:00 GMT

టెస్ట్ కోసం శాంపిల్స్ ఇచ్చాక రిజల్ట్ ఎలా వస్తుందో అని టెన్షన్. రెండ్రోజులు వేచి వుండాలన్నా రెండు యుగాల్లా అని పిస్తుంది. ఇక నుంచి అలాంటి టెన్షన్ ఏం లేకుండా సంజీవిని సంచార ల్యాబ్ ద్వారా 15 నిమిషాల్లోనే రిజల్ట్ అందిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కరోనా టెస్ట్ లను వేగవంతం చేసేందుకు ఆర్టీసీకి చెందిన ఇంద్ర హైటెక్ బస్సులను కొవిడ్ ర్యాపిడ్ టెస్ట్ లకు అనుగుణంగా మార్పులు చేశారు. ఒక్కో బస్సు లోపల దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు వెచ్చింది ఒకేసారి పది మందికి ర్యాపిడ్ టెస్ట్ లు చేసే విధంగా రూపకల్పన చేశారు. ఏసీ సౌకర్యంతో పాటు పది కౌంటర్లు ఉంటాయి. బస్సు అద్దాలకు మనిషి చేయి దూరేంత రంధ్రం ఏర్పాటు చేశారు. బస్సులోని ఒక్కో కౌంటర్ వద్ద ఒక డాక్టర్, ఒక టెక్నీషియన్ ఉంటారు.

బస్సు బయట అద్దాలకు ఏర్పాటు చేసిన రంధ్రాల ద్వారా పరీక్ష చేయించుకునే వెసులు బాటు వుంటుంది. బయట నుంచున్న వ్యక్తి ముక్కులోంచి శాంపిల్ తీసి ర్యాపిడ్ యాంటీజెన్ కిట్ తో పరీక్షిస్తారు. ఈ ప్రక్రియ అంతా కేవలం 15 నిమిషాల్లో పూర్తవుతుంది. పది కౌంటర్ల నుంచి ఒకేసారి పది మంది ఫలితాలు వచ్చేలా ఏర్పాటు చేశారు. బస్సు ద్వారా రోజుకు వెయ్యి పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని కల్పించారు. తక్కువ సమయంలో ఎక్కువ పరీక్షలు నిర్వహించే వీలున్నందున ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. కాకినాడ, అమలాపురం డివిజన్లలో ఈ మొబైల్ ర్యాపిడ్ బస్సులను ఏర్పాటు చేశారు. ఈ టెస్ట్ లో పాజిటివ్ వస్తే వైద్యం మొదలు పెడతారు. లక్షణాలు వుండీ నెగిటివ్ వస్తే పూర్తి నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ టెస్ట్ కు పంపిస్తున్నాం అని డాక్టర్ సీహెచ్ పుష్కరరావు వివరించారు.

Similar News