ఏపీలో రాగల నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా లో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర మధ్య కర్ణాటక ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి బలహీన పడ్డాయి. అయితే నైరుతీ రుతుపవనాల ప్రభావంతో రానున్న నాలుగు రోజులు కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో అనేకచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో తేలికపాటిగా చెదురుమదురుగా జల్లులు పడే అవకాశాలున్నాయి. బుధవారం ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.