వెండితెరపై వెలిగి.. జీవితంలో ఓడి దీనస్థితిలో..

Update: 2020-07-24 20:07 GMT

అదో అందమైన రంగుల ప్రపంచం. ఒక్కసారి అందులోకి అడుగుపెడితే ఎన్ని ఒడిదుకులు ఎదురైనా తట్టుకుని నిలబడగలిగితే స్టార్ స్టేటస్ సొంతమవుతుంది. అభిమానుల పలకరింతలు, థియేటర్లలో ప్రేక్షకుల ఈలలు, చప్పట్లతో నటీనటులకు కొత్త ఉత్సాహం వస్తుంది. వెనుకడుగు వేయనివ్వదు. నడిచినంత కాలం ఆ హవా నడుస్తుంది. కానీ ఒక్కసారి తెరమరుగైతే వాళ్ల జీవితాలు రోడ్డు మీద పడుతుంటాయి. అలాంటి నటీనటుల జీవితాలు మనకళ్ల ముందు ఎన్నో సాక్షాత్కరిస్తుంటాయి. వారిలో కొందరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే కడుపుతరుక్కుపోక మానదు. లగ్జరీ లైఫ్ కి అలవాటు పడి చేతిలో పైసా లేని పరిస్థితిలో రోడ్డు మీద బిచ్చమెత్తుకుంటున్న వారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

ఓపీ నాయర్.. బాలీవుడ్ సంగీతదర్శకునిగా స్టార్ హీరోల సినిమాలకు పని చేసి ఇంటర్వ్యూలతో క్షణం తీరిక లేకుండా గడిపిన నాయర్.. మద్యానికి బానిసై ఆస్సత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

జోహ్రాబ్రీన్.. చిత్ర పరిశ్రమలో ఓ సెన్సేషన్ క్రియేటచేసిన జోహ్రాను కొడుకు, కూతురు ఆమెను అనాధలా వదిలేశారు. కుటుంబం కోసం ఎంతో కష్టపడింది. చివరి క్షణాల్లో సైతం కుటుంబ సభ్యులు ఎవరూ ఆదుకోలేదు. దీంతో అనాథలానే ఆమె కన్నుమూశారు.

పర్వీన్ బాబీ.. తన అందంతో అలరించిన నటి.. తీవ్రమైన డిప్రెషన్ తో 2005లో కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబసభ్యులు ఎవరూ రాకపోవడంతో చివరికి నిర్మాత మహేష్ భట్ ఆమె అంత్యక్రియలు జరిపించే బాధ్యత తీసుకున్నారు.

మీనా కుమారి.. ఆమె అందానికి పరవశులై స్టార్ హీరోలు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఆమె తను ప్రేమించిన కమల్ అమ్రోహిని వివాహం చేసుకుంది. వివాహమైన తరువాత అతడికి వేరే మహిళలతో అక్రమసంబంధాలు ఉన్నాయని తెలిసి గుండె పగిలేలా రోదించింది. మద్యానికి బానిసై తనువు చాలించింది.

రాజ్ కిరణ్.. కార్జ్ చిత్రంలో రిషికపూర్ తో పాటు నటించిన హీరో అతడు. 2010లో అట్లాంటాలో మతిస్థిమితం కోల్పోయి రోడ్డు మీద తిరుగుతూ రిషికపూర్ కంటపడ్డారు.

మితాలీ శర్మ.. భోజ్‌పురి నటిగా ఎంతో ప్రజాదరణ పొందిన నటి. ఒకప్పుడు అగ్ర హీరోల సరసన నటించింది. ఇప్పుడు ముంబై వీధుల్లో యాచకురాలిగా కనిపించింది. ఒకటి రెండు సార్లు దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల చేతికి చిక్కింది.

భగవాన్ దాదా.. ఖరీదైన కార్లు, బంగళాలు ఉన్న స్టార్ భగవాన్ దాదా పరిస్థితి తలక్రిందులై బంగ్లా నుంచి ముంబై మురికి వాడల్లో జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి అక్కడే ప్రాణాలు కోల్పోయారు.

భరత్ భూషణ్.. ఉత్తమ నటుడిగా ఎన్నో పాత్రలు పోషించిన భరత్ భూషణ్ మీనాకుమారి లాంటి హీరోయిన్లతో ప్రేమ వ్యవహారం నడిపారు. కొంతకాలానికి సినిమాల్లో అవకాశాలు లేక ఫిల్మ్ స్టూడియోలో గేట్ కీపర్ గానూ పనిచేశారు. చివరకు ఉంటున్న ఇంటికి అద్దె కట్టుకోలేని పరిస్థితిలో మరణించారు.

గీతాంజలి నాగ్‌పాల్.. ఎంతో మంది స్టార్లకు డిజైనింగ్ చేసిన సుప్రసిద్ద మోడల్, ఫ్యాషన్ డిజైనర్. డ్రగ్స్, మద్యానికి బానిసై ఆస్తులన్నీ పోగొట్టుకుంది. ప్రస్తుతం ఢిల్లీ వీధుల్లో యాచిస్తూ బతుకుతోంది.

జగదీష్ మాలి.. ప్రముఖ ఫొటోగ్రాఫర్.. ఒకప్పుడు ఆయన తీసిన ఫోటోలకు క్రేజ్ ఉండేది. పరిస్థితులు తారుమారై స్టూడియోను అమ్ముకోవాల్సి వచ్చింది. ఓసారి రోడ్డుపై యాచిస్తూ హీరో సల్మాన్ ఖాన్ కంటపడ్డాడు. దాంతో సల్మాన్ అతడికి ఆర్థిక సహాయం అందించాడు.

Similar News